స్కామ్ ల ప్రభుత్వం కాదు స్కీముల ప్రభుత్వం కావాలి
స్కామ్ ల ప్రభుత్వం కాదు స్కీముల ప్రభుత్వం కావాలి
- దేవుణ్ణి మోసం చేసిన రేవంత్ రెడ్డికి మీరెంత?
- మాజీ మంత్రి హరీష్ రావు సూటి ప్రశ్న
- బిఆర్ఎస్ సమావేశం విజయవంతం
అశ్వారావుపేట రూరల్, ఆంధ్రప్రభ : మాకు స్కాముల ప్రభుత్వం కాదు స్కీములప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి ,బిఆర్ఎస్ శాసనసభ పక్షం నేత హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో వేలాది కోట్ల రూపాయల స్కాములు జరిగాయని బిఆర్ఎస్ హయాంలో మాత్రం వందలాది స్కీములను అమలు చేశామని ప్రజలు దానినే కోరుకుంటున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. సాక్షాత్తు భద్రాచలం సీతారామచంద్రస్వామినే మోసం చేసిన ఘన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని హరీష్ రావు దుయ్యబట్టారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి సాక్షిగా రుణమాఫీ అమలు చేస్తానని ఎగ్గొట్టారని దేవుని మోసం చేసిన సీఎంకు మీరు ఎంత అని హరీష్ రావు అన్నారు.

ఖజానాలో సొమ్ము లేక కాదని సీఎంకు మనసు లేక ప్రజా సంక్షేమానికి నిధులు ఖర్చు చేయడం లేదని అన్నారు. రైతాంగానికి 29 వేల కోట్ల రూపాయల రైతుబంధును ఇప్పటివరకు ఎగ్గొట్టారని కరోనా సమయంలో కూడా వేసవిలో రైతుబంధుకు నగదు లేదని కేసిఆర్ కు అధికారులు చెబితే అధికారులకు కాంట్రాక్టర్లకు జీతాలు బిల్లులు ఆపండి అని రైతుబంధును మాత్రం తప్పనిసరిగా వేయాల్సిందేనని అన్నారని కరోనా సమయంలోను రైతుబంధు ఆగకుండా విడుదల చేశారని దటీజ్ కేసీఆర్ అని హరీష్ రావు పేర్కొన్నారు.
పనిచేయని సీఎంకు కోట్లాది రూపాయలతో క్యాంపు కార్యాలయాలు ఎందుకని అందాల పోటీలకు, క్యాంపు కార్యాలయాలకు, ఇతరత్రా ప్రాజెక్టులకు వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు, తులం బంగారం ఇవన్నీ మటుమాయం చేశారని అన్నారు. కేవలం కమిషన్లు వచ్చే పనులు మాత్రమే రేవంత్ సర్కార్ నిర్వహిస్తుందని అవాతాతలకు పెన్షన్లు పెంచితే మహిళలకు మహాలక్ష్మి ఇస్తే రైతులకు రైతుబంధు ఇస్తే ప్రభుత్వానికి కమిషన్ రాదు కనుక అందుకే వాటిని సరిగా అమలు చేయడం లేదని అన్నారు.
ఈ నెల 30న చింతకానిలో రైతు ఆశీర్వాద సభ పెడుతున్నారని రైతులు సీఎంను ఆశీర్వదించాలని డిప్యూటీ సీఎం బట్టి కోరుతున్నారని ఏ మొహం పెట్టుకొని ఆశీర్వాద సభ పెడుతున్నారని హరీష్ రావు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. రైతాంగానికి ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో 29 వేల రూపాయల రైతుబంధును ఎగ్గొట్టినందుకా? రెండు పంట బోనస్ లు ఇవ్వనందుకా? రైతు బీమా ఇవ్వనందుకా? రైతులకు సరిపడు యూరియా ఇవ్వనందుకా? దేనికి రైతులు సీఎంని ఆశీర్వదించాలని అన్నారు. ప్రభుత్వంపై గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఏ ఎన్నికలు జరిగినా ప్రభుత్వ పతనం ఖాయమని హరీష్ రావు పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీల మీద కపట ప్రేమ నటిస్తుందని అసెంబ్లీలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్సీలు, బీసీలు, ఎస్టీలకు సుమారు 12వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ను కేటాయించామని చెబుతున్నారని కానీ ఖర్చులు వివరాలు అడిగితే మాత్రం ఇప్పటివరకు ఏ శాఖకు కూడా పైసా విడుదల చేయ లేదని చెప్పడంలోనే అణగారిన వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ,బీసీ బందు అమలు చేశామని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజా సంక్షేమ పథకాలను ఏ రోజున కూడా ఆపిన సందర్భం లేదని అన్నారు.
జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకి కూడా డబ్బు మీద ఉన్న ధ్యాస అభివృద్ధి మీద లేదని ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి అన్ని అనుమతులు తీసుకుని వచ్చారని అలాగే మండలంలోని పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండు సంవత్సరాలు దాటిన ఇప్పటివరకు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అన్నారు. అలాగే సీతారామ ప్రాజెక్టుకి కనీసం కాలువలు తవ్వి రైతులకు నీటిని కూడా ఇవ్వలేకపోతున్న దద్దమ్మ ప్రభుత్వం అని దుయ్యబట్టారు.
అలాగే ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి తన వద్ద మున్సిపల్, హోమ్ ,విద్యా శాఖలను ఉంచుకుని ఆ మూడు శాఖల నిర్వహించడంలో ముఖ్యమంత్రి ఘోరంగా విఫలమయ్యారని హరీష్ రావు విమర్శించారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి 24 గంటలు ఉచిత కరెంటును అందజేశారని నేటి సర్కారు ఏడు నుంచి తొమ్మిది గంటల కరెంటు ఇవ్వడానికే నానా తండాలు పడుతుందని ఏడె నెమిది గంటలకు నియోజకవర్గంలోని పామాయిల్ పంటలు ఏ విధంగా పండుతాయని హరీష్ రావు విమర్శించారు.
అదీకాకుండా ఇప్పుడు రైతు డిస్కం అని కొత్త నాటకాలు ఆడుతున్నారని దీంతో రైతుల పొలాల్లో బోర్లకు మీటర్లను బిగించి తప్పనిసరిగా చార్జీలు వసూలు చేయనున్నారని దీంతో కాంగ్రెస్ సర్కారు పతనం ఖాయమని అన్నారు. అలాగే ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు టిఆర్ఎస్ కు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని పార్టీ నాయకులు కార్యకర్తలు కిందిస్థాయి నుండి ఏమాత్రం నిర్లక్ష్యంతో వ్యవహరించకుండా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ఎన్నికల సంఘం అమలు చేస్తున్న సర్ పై పార్టీ శ్రేణులు అప్రమత్తతో ఉండాలని లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు. ఈ సమావేశంలో ముందుగా మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లు కొద్దిసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తాతా మధు, తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చ నాగేశ్వరరావు, రేగా కాంతారావు, దిండిగాల రాజేందర్, బొమ్మెర రామ్మూర్తి, ఉప్పల వెంకటరమణ, రావు జోగేశ్వరరావు,పలువురు రాష్ట్ర ,జిల్లా, పూజ,నియోజకవర్గ స్థాయి నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు , పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
