ఇండియన్ నేవీలో ఎంపికైన యువకుడికి ఘన సన్మానం..

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఎలగడప గ్రామానికి చెందిన రామగిరి సతీష్ కుమారుడు రామగిరి హర్షిత్ ఇటీవల అగ్నివీర్ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచాడు.

ఈ సందర్భంగా మంగళవారం ఎలగడప గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో హర్షిత్ కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఉద్యోగం సాధించిన హర్షిత్ తరఫున ఆయన తండ్రి రామగిరి సతీష్‌కు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, హర్షిత్ సాధించిన విజయం గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పట్టుదల, కృషితో లక్ష్యాలను సాధించవచ్చని యువతకు సందేశమిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింగ్ అశ్విత, ఉపసర్పంచ్ రాపర్తి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి చిట్యాల పద్మ, పీఏసీఎస్ డైరెక్టర్ నాంపల్లి భూమరాజన్న, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.