KTR | ధైర్యంగా ఉండండి.. తోడుగా ఉంటాం..

  • అక్రమ కేసులతో అణచివేయలేరు..
  • బాల్క సుమన్ కుటుంబ సభ్యులతో కేటీఆర్

హైదరాబాద్ ఆంధ్రప్రభ : ప్రజల పక్షాన పోరాటం చేయడం వల్ల ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి బాల్క సుమన్ ను జైలుకు పంపిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాల్క సుమన్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బాల్క సుమన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాల్క సుమన్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రజల తరఫున బలమైన ప్రతిపక్ష నాయకుడిగా సుమన్ వ్యవహరించారని, ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న అవినీతి అంశాలను ప్రశ్నించినందుకే ఆయనపై కేసులు నమోదు చేశారని విమర్శించారు.

ప్రతిపక్ష గొంతును అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించిన కేటీఆర్.. రాజకీయ కక్షసాధింపులతో కేసులు పెట్టినా బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గబోరని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు తమకే ఉందని, రాబోయే రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.