Multi-level Marketing Scam | ‘ఇగ్నైట్’ పేరుతో కొత్త వల.. పాత ముఠా ఆటకట్టు

Multi-level Marketing Scam | ‘ఇగ్నైట్’ పేరుతో కొత్త వల.. పాత ముఠా ఆటకట్టు

  • రూ.5 వేల కోట్ల మోసాన్ని అడ్డుకున్న హైదరాబాద్ పోలీసులు
  • 18 రోజుల్లోనే వేల కోట్ల మోసానికి ప్లాన్.. ఆరుగురు అరెస్ట్
  • హాంకాంగ్ నుంచి హైదరాబాద్ వరకు..
  • ఇగ్నైట్ స్కామ్‌పై పోలీసుల ఉక్కుపాదం

హైదరాబాద్, ఆంధ్రప్రభ: అధిక లాభాల పేరుతో అమాయక ప్రజలను వలలో వేసుకుని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు సిద్ధమైన మరో భారీ మల్టీ లెవల్ మార్కెటింగ్ (Multi-level Marketing Scam) నెట్‌వర్క్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు భగ్నం చేశారు. కేవలం 18 రోజుల క్రితమే కార్యకలాపాలు ప్రారంభించిన ‘ఇగ్నైట్’ అనే కంపెనీ అమాయ‌కుల‌కి వ‌ల వేయ‌డం ప్రారంభించింది. ఈ విషయంపై న‌గ‌ర పోలీసులు ఉక్కుపాదం మోపారు.

దాంతో సుమారు రూ. 5,000 కోట్ల విలువైన మోసాన్ని అడ్డుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. ‘ఆపరేషన్ ఇగ్నైట్ క్రాక్‌డౌన్’ పేరుతో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

క్లిక్ గ్లోబల్.. క్యూనెట్.. ఇప్పుడు ఇగ్నైట్!

దర్యాప్తులో వెలుగుచూసిన అంశాలు పోలీసులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్లిక్ గ్లోబల్, క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న నిర్వాహకులే ఇప్పుడు ‘ఇగ్నైట్’ పేరుతో కొత్త వ్యవస్థను ప్రారంభించినట్లు పోలీసులు గుర్తించారు. గత మూడు దశాబ్దాలుగా ఒకే తరహా వ్యాపార నమూనాతో ప్రజలను ఆకర్షిస్తూ.. పేర్లు మాత్రమే మార్చుకుంటూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు. మొదట గోల్డ్ క్వెస్ట్, ఆ తర్వాత క్వెస్ట్ నెట్, తరువాత క్యూనెట్, ఇప్పుడు ఇగ్నైట్ పేరుతో అదే తరహా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు.

సభ్యులను చేర్చితే లక్షలు.. అంటూ వల !!

ఈ సంస్థ నిర్వాహకులు తక్కువ సమయంలో భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తూ ప్రజలను సభ్యులుగా చేర్చుకునేవారని పోలీసులు తెలిపారు. ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు, కొత్త సభ్యులను చేర్చితే మరిన్ని ఆదాయాలు వస్తాయని ఆశ చూపించేవారని వెల్లడించారు. ఒక సభ్యుడు మరో ఇద్దరిని, వారు ఇంకొంత మందిని చేర్చే విధంగా గొలుసుకట్టు వ్యవస్థను ఏర్పాటు చేసి వేలాది మందిని ఈ నెట్‌వర్క్‌లోకి లాగేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు.

విదేశాల్లో సూత్రధారులు

ఈ స్కామ్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు హాంకాంగ్, దుబాయ్, మలేషియా వంటి దేశాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి బాధితుల నుంచి అందిన మూడు ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల ప్రవాహంపై లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్న పోలీసులు, కేసు వివరాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.

అధిక లాభాలు, వేగంగా డబ్బు సంపాదించే అవకాశాలు, కొత్త సభ్యులను చేర్చితే భారీ కమిషన్లు వంటి ఆఫర్లతో వచ్చే మల్టీ లెవల్ మార్కెటింగ్ పథకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే పథకాల విషయంలో పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండా డబ్బులు పెట్టొద్దు. గొలుసుకట్టు పద్ధతిలో నడిచే స్కీమ్‌లకు దూరంగా ఉండాలి అని పోలీసులు హెచ్చరించారు.

APLiquorScam | హైదరాబాద్‌లో పలుచోట్ల సోదాలు..

Leave a Reply