Andhra Prabha Special Story | మాదాకా రాదులే అన్న నిర్ల‌క్ష్యం వద్దు…

Andhra Prabha Special Story | మాదాకా రాదులే అన్న నిర్ల‌క్ష్యం వద్దు…

  • నేరం జరిగిన తర్వాత కాదు.. జరగకముందే జాగ్రత్తపడాలి
  • వార్తల్లో చదివి మర్చిపోవద్దు.. ఇది మీ పిల్లల కోసమే
  • ప్రేమ, ఫోన్, సోషల్ మీడియా నుంచి పిల్లలను కాపాడటం ఎలా?

Andhra Prabha Special Story | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇటీవలి కాలంలో చిన్నారులపై, మహిళలపై మాత్రమే కాదు.. వృద్ధులు, పురుషులు అనే తేడా లేకుండా లైంగిక వేధింపులు, దాడుల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కామాంధుల విచ్చలవిడితనం సమాజంలో ఆందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. ఇలాంటి సంఘటనలు నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చోటుచేసుకుంటుండటం మరింత ఆందోళన కలిగించే విషయం. అందుకే భద్రత విషయంలో కుటుంబాలు, విద్యాసంస్థలు, సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

అయితే, పక్క రాష్ట్రంలో ఏదో జరిగింది లే.. మనవరకు రాదు, పక్క జిల్లాలో జరిగింది లే.. మనకు సంబంధం లేదు, పక్క ఊరిలో జరిగింది లే.. మనకేం కాదు, పక్క వీధిలో జరిగింది లే.. మన ఇంటివరకు రాదు అని సున్నితమైన అంశాలను నిర్లక్ష్యంగా తీసుకుంటే, ఆ ప్రమాదం రేపు మన ఇంటి తలుపు కూడా తట్టే అవకాశం ఉంది. అందుకే అప్రమత్తత అవసరం. అంతేగానీ ప్రతి విషయాన్ని అతిగా అనుమానంతో చూడాలని కాదు. సరైన అవగాహన, తగిన జాగ్రత్తలు, పిల్లలతో నిరంతర సంభాషణ ఉంటే చాలావరకు ప్రమాదాలను నివారించవచ్చు.

మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణ.. పోక్సో కేసు నమోదు

తెలిసిన వారే నిందితులైతే..?

ఆడుకోవడానికి బయటకు వెళ్లిన పిల్లలు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరుకుంటారనే నమ్మకం ప్రతి తల్లిదండ్రిలో ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆ నమ్మకాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. పిల్లలు ఎక్కువగా అపరిచితుల వల్ల కాకుండా, తమకు తెలిసిన వ్యక్తులు, బంధువులు, పొరుగువారు లేదా కుటుంబానికి సన్నిహితులైన వారి ద్వారానే వేధింపులకు గురవుతున్నారన్నది అనేక సందర్భాల్లో బయటపడుతున్న చేదు నిజం.

“మా పిల్లతో ఇలాంటిది జరగదు” అనే నిర్లక్ష్య ధోరణి ప్రమాదకరం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటి దగ్గరే ఆడుకుంటున్నారని, బంధువులు లేదా పరిచయస్తుల మధ్యే ఉంటున్నారని నిశ్చింతగా భావిస్తారు. కానీ చిన్నారులపై జరుగుతున్న అనేక లైంగిక నేరాల్లో నిందితులు కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారు లేదా పరిచయస్తులే ఉండటం ఆందోళన కలిగించే అంశం.

ఈ మార్పులు కనిపిస్తే అప్రమత్తం కావాలి

అందుకే పిల్లలకు “తెలిసిన వ్యక్తి అంటే ఎప్పుడూ సురక్షితం కాదు” అనే విషయాన్ని వయసుకు తగ్గట్టుగా అర్థమయ్యే రీతిలో వివరించాలి. చిన్నప్పటి నుంచే “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” గురించి అవగాహన కల్పించాలి. ఎవరూ తాకకూడని శరీర భాగాలు ఏవి? ఎవరైనా అసౌకర్యంగా ప్రవర్తిస్తే ఎలా స్పందించాలి? గట్టిగా “నో” ఎలా చెప్పాలి? వెంటనే తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన పెద్దలకు ఎందుకు చెప్పాలి? వంటి అంశాలపై పిల్లలకు స్పష్టమైన అవగాహన ఉండాలి.

Andhra Prabha Special Story

పిల్లల్లో ఒక్కసారిగా కొన్ని ప్రవర్తనా మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒంటరిగా ఉండటం, భయపడటం, ఆందోళన చెందడం, నిద్రలేమి, పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడం, కొందరు వ్యక్తులను చూసి అసహజంగా ప్రవర్తించడం, మానసిక ఒత్తిడి లక్షణాలు కనిపించడం వంటివి కొన్నిసార్లు వేధింపులకు గురైన పిల్లల్లో కనిపించే సంకేతాలుగా నిపుణులు చెబుతున్నారు. అలాంటి మార్పులు గమనిస్తే పిల్లలతో ప్రేమగా మాట్లాడి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

చట్టాలు శిక్షించగలవు.. కానీ నేరాలను ఆపగలవా?

నేటి కాలంలో ప్రమాదాలు కేవలం బయట ప్రపంచానికే పరిమితం కావడం లేదు. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, చాటింగ్ యాప్‌ల ద్వారా కూడా చిన్నారులు మోసగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. అపరిచితులతో చాటింగ్ చేయవద్దని, ఫోటోలు లేదా వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని అవగాహన కల్పించాలి.

చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పోక్సో (POCSO) చట్టం అమలు చేస్తోంది. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లలపై జరిగే లైంగిక నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయి. చిన్నారి వాంగ్మూలానికి ప్రత్యేక ప్రాధాన్యం కల్పించడంతో పాటు బాధితులకు చట్టపరమైన రక్షణ కూడా అందిస్తారు. కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి.

అయితే, చిన్నారుల రక్షణ కోసం కఠినమైన పోక్సో (POCSO) చట్టాన్ని తీసుకొచ్చినా, చిన్నారులపై లైంగిక వేధింపులు పూర్తిగా ఆగడం లేదు. చట్టం అనేది నేరం జరిగిన తర్వాత నిందితుడిని శిక్షించగలదు. కానీ నేరం జరగకుండా పూర్తిగా అడ్డుకోవడం ఒక్క చట్టం వల్ల సాధ్యం కాదు. దీనికి అసలైన ఫుల్‌స్టాప్ కుటుంబాల్లో అవగాహన పెరగడం, పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం, సమాజంలో నైతిక విలువలు బలపడటం, ప్రతి వ్యక్తిలో బాధ్యత పెరగడమే. పిల్లలకు భయం కాకుండా ధైర్యం నేర్పాలి.

ప్రేమా..? ఆకర్షణా..? పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి

చిన్నారులపై జరిగే నేరాలను కేవలం ఒక కుటుంబ సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలు సురక్షితంగా ఎదగాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, సమాజం అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలి. ఒక్క క్షణం అప్రమత్తత.. ఒక చిన్నారి భవిష్యత్తును కాపాడగలదు. పిల్లలకు ధైర్యం చెప్పండి, వారి మాట వినండి, వారి భద్రతను మీ తొలి బాధ్యతగా భావించండి.

పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, సమాజం కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లలతో స్నేహపూర్వక సంబంధం పెంచుకోవడం, వారు చెప్పే ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినడం, ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను పంచుకునే వాతావరణం కల్పించడం అత్యంత కీలకం.

Andhra Prabha Special Story

కొన్ని సందర్భాల్లో చిన్నారులు, యుక్తవయస్కులు ప్రేమ అనే భ్రమలో చిక్కుకుని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్న ఘటనలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న వయసులోనే ప్రేమ, ఆకర్షణ, అభిమానం మధ్య తేడాను గుర్తించలేకపోవడం, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే ఫ్యాంటసీలను నిజ జీవితంతో పోల్చుకోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులు కొన్నిసార్లు దుర్వినియోగానికి, బ్లాక్‌మెయిలింగ్‌కు, వేధింపులకు దారితీయవచ్చు.

ఇలాంటి మార్పులను గుర్తించి పిల్లలకు సరైన మార్గనిర్దేశం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. అయితే యుక్తవయసులో ఉన్న పిల్లలకు ఏదైనా విషయం వద్దని చెప్పినప్పుడు, పెద్దలు తమ స్వేచ్ఛకు అడ్డుపడుతున్నారనే భావన కలగవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులే వారికి విలన్లుగా కనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీంతో పిల్లలు, పెద్దల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగే ప్రమాదం ఉంటుంది.

అలాంటి గ్యాప్‌ను కొందరు తప్పుదారి పట్టించే వ్యక్తులు తమకు అనుకూలంగా మలచుకునే అవకాశమూ ఉంటుంది. అందుకే పిల్లలతో ఆజ్ఞలు జారీ చేసే ధోరణి కంటే, స్నేహపూర్వకంగా మాట్లాడే విధానం మరింత అవసరం. వారి ఆలోచనలు, సందేహాలు, భావోద్వేగాలను అర్థం చేసుకుంటూ, సరైనది ఎంటో.. తప్పు ఏంటో ఓపికగా వివరించాలి. పిల్లలు ఏ సమస్య వచ్చినా ముందుగా కుటుంబ సభ్యులతోనే పంచుకునే నమ్మకం కల్పించడం ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన భద్రతా చర్యగా నిపుణులు సూచిస్తున్నారు.

ఎఐ, జెన్-జీ యుగంలో పేరెంటింగ్‌కు కొత్త సవాళ్లు

అలాగే, ఎలా అయితే చిన్నారులకు “గుడ్ టచ్ – బ్యాడ్ టచ్” గురించి అవగాహన కల్పిస్తామో, అదే విధంగా బాలురకు కూడా చిన్నప్పటి నుంచే మంచి-చెడు, పరస్పర గౌరవం, వ్యక్తిగత హద్దులు, అమ్మాయిలతో మర్యాదపూర్వకంగా ఎలా ప్రవర్తించాలి అనే అంశాలపై అవగాహన కల్పించాలి. లైంగిక నేరాలను అరికట్టడంలో బాధితులకు మాత్రమే కాదు, భావి తరాలకు సరైన విలువలు నేర్పించడంలోనూ సమాజం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

Andhra Prabha Special Story

ప్రస్తుతం ఎఐ, జెన్-జీ యుగంలో పిల్లల పెంపకాన్ని పూర్తిగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, సోషల్ మీడియా, స్క్రీన్‌లకు వదిలేయకుండా తల్లిదండ్రులు కూడా చురుకైన పాత్ర పోషించాలి. టెక్నాలజీని ఉపయోగించడం ఎంత ముఖ్యమో, దాని వల్ల కలిగే ప్రమాదాలను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. పిల్లలు ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? వారి ఆలోచనా విధానం ఎలా మారుతోంది? వంటి అంశాలపై తల్లిదండ్రులు ఓ అవగాహన కలిగి ఉండాలి.

సమాజంలో జరుగుతున్న పరిణామాలు, నేరాల పద్ధతులు, సోషల్ మీడియా ప్రభావం, సంబంధాల విలువ వంటి అంశాలను పిల్లలకు వారి వయసుకు తగిన రీతిలో వివరించాలి. భయపెట్టడం కాదు.. అవగాహన కల్పించడం ముఖ్యం. పిల్లలు ఏ సందేహం వచ్చినా తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే వాతావరణాన్ని ఇంట్లోనే నిర్మించగలిగితే, అనేక ప్రమాదాలను ముందుగానే నివారించే అవకాశం ఉంటుంది.

ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ వార్తలు వస్తాయి.. చర్చలు జరుగుతాయి.. అవగాహన కథనాలు ప్రచురితమవుతాయి. కానీ బాధ్యత అనే భావన ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిలో పెరగకపోతే సమాజంలో మార్పు రావడం కష్టం. చట్టాలు నేరస్తులను శిక్షించగలవు.. కానీ జాగ్రత్త, విలువలు, అవగాహన మాత్రమే నేరాలను ముందుగానే అడ్డుకోగలవు. పిల్లల భద్రత అనేది కేవలం తల్లిదండ్రుల బాధ్యత కాదు.. సమాజం మొత్తానికి సంబంధించిన బాధ్యత. మన ఇంటి పిల్లలే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి చిన్నారి సురక్షితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మనందరిదీ. అప్పుడే ఇలాంటి ఘటనలు తగ్గి, నిజమైన మార్పు సమాజంలో కనిపిస్తుంది.

Leave a Reply