ఏడాది పాలన పూర్తి.. నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు

ఏడాది పాలన పూర్తి.. నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు

మక్తల్, (ఆంధ్రప్రభ): నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల, పాడిపరిశ్రమల అభివృద్ధి, యువజన సర్వీసులు, మత్స్యశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తి అయిన సందర్భంగా మక్తల్ నియోజకవర్గవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయంలో మంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వివేకానంద చౌరస్తా వద్ద భారీ ఎత్తున బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.

తదుపరి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే నియోజకవర్గంలోని గ్రామాల్లో కూడా కాంగ్రెస్ శ్రేణులు ఆలయాల్లో అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత స్థానికుడిగా డాక్టర్ వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కడం మాత్రమే కాకుండా రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందడం గర్వకారణమని తెలిపారు. ఆయన పాలనలో నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు.

మక్తల్ నుండి జిల్లా కేంద్రం నారాయణపేటకు రూ.210 కోట్లతో నాలుగు లైన్ల రహదారి, మక్తల్ పట్టణంలో రూ.500 కోట్లతో 150 పడకల ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. అదేవిధంగా కోర్టు, ఫైర్ స్టేషన్ ప్రారంభం, డిగ్రీ కళాశాల మంజూరు, రూ.68 కోట్లతో 65 కిలోమీటర్ల బీటీ రోడ్ల మంజూరు జరిగిందని చెప్పారు.

కృష్ణా నదిపై ఆత్మకూరు వద్ద వంతెన నిర్మాణం కొనసాగుతుందని, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధి ఏడాది పాలనలో జరిగిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply