హైదరాబాద్, రంగారెడ్డి జట్లకు టైటిళ్లు
హైదరాబాద్, రంగారెడ్డి జట్లకు టైటిళ్లు
- 11వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ ఘన ముగింపు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన 11వ తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జయశంకర్ భూపాలపల్లి బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలబాలికల జట్లు ప్రతిభ కనబరిచి క్రీడాభిమానులను అలరించాయి.
బాలుర విభాగంలో హైదరాబాద్ జిల్లా జట్టు అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా జట్టు రన్నరప్‌గా నిలవగా, రంగారెడ్డి జిల్లా జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. బాలికల విభాగంలో రంగారెడ్డి జిల్లా జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జట్టు ద్వితీయ స్థానం సాధించగా, హైదరాబాద్ జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచింది.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర సత్యనారాయణ రావు విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, విజయం సాధించిన వారు మరింత కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఓటమి చెందిన వారు నిరుత్సాహపడకుండా తమ లోపాలను సరిదిద్దుకుని ముందుకు సాగాలని చెప్పారు.
క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్న ఎమ్మెల్యే, జిల్లా స్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు. పోటీల విజయవంత నిర్వహణకు క్రీడాశాఖ అధికారులు, నిర్వాహకులు, కోచ్‌లు, న్యాయనిర్ణేతలు, స్వచ్ఛంద సేవకులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బట్ కరుణాకర్, డీఎస్పీ సంపత్ రావు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
