వివాహేతర సంబంధం.. సైనికుడి దారుణ హత్య!
వివాహేతర సంబంధం.. సైనికుడి దారుణ హత్య!
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ:
వివాహేతర సంబంధం ఓ సైనికుడి దారుణ హత్యకు దారితీసింది. కట్టుకున్న భార్య ఆమె తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఘాతుకానికి పాల్పడింది. మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన పుంటికూర కుమార్ గౌడ్(50) భార్య పద్మ ఇద్దరు కూతుళ్లతో మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆర్మీలో ఉద్యోగం చేస్తున్న కుమార్ గౌడ్ ఇటీవల స్వగృహానికి వచ్చినట్లు తెలిపారు.
కాగా కుమార్ కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉండటంతో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం మరో మహిళలతో ఉన్న కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య, అత్తమామ, బావమరిదితో పాటు ఇతర వ్యక్తులు కుమార్ గౌడ్ దాడికి పాల్పడగా ఆయన మృతి చెందాడు. విషయం తెలుసున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు పద్మ, ఆమె తల్లిదండ్రులు రామకృష్ణా గౌడ్, ఎల్లమ్మ, సోదరుడు సంతోష్ పోలీసులకు లొంగిపోగా, ఇతర గుర్తుతెలియని వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
