ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’కు విశేష స్పందన

ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’కు విశేష స్పందన

  • అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ ప్రారంభం

కర్నూలు, ఆంధ్రప్రభ: యువతతో పాటు ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, కృష్ణమోహన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని వారు ఘనంగా ప్రారంభించారు.

కర్నూలు జిల్లా పోలీసు అధికారి విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన సైకిల్ ర్యాలీకి అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం అత్యంత అవసరమని పేర్కొన్నారు. సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందన్నారు. అలాగే వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు సైక్లింగ్ దోహదపడుతుందని వివరించారు.

కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ ఓల్డ్ కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ ప్రాంతాల మీదుగా సాగి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ముగిసింది. ర్యాలీ మార్గమంతా పోలీసులు ఉత్సాహంగా సైక్లింగ్ చేస్తూ ప్రజల్లో ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐలు గుణశేఖర్ బాబు, పార్థసారథి, ఆర్‌ఐలు నారాయణ, పోతలరాజు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం

ఫిట్ ఇండియా ఉద్యమం లక్ష్యాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడంతో పాటు పర్యావరణ హిత రవాణా విధానాల ప్రాధాన్యాన్ని పోలీసులు చాటిచెప్పారు. ప్రజలు కూడా సైక్లింగ్‌ను అలవాటుగా మార్చుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

Leave a Reply