ప్రతి ఒక్కరూ ధైర్యంగా వెళ్లి కంటి ఆపరేషన్లు చేయించుకోండి
ప్రతి ఒక్కరూ ధైర్యంగా వెళ్లి కంటి ఆపరేషన్లు చేయించుకోండి
-మహిళలు, వృద్ధులకు ఆత్మీయ భరోసా
-14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం
– ప్రారంభించిన కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా వెళ్లి ఆపరేషన్లు చేయించుకోవాలని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల ప్రజల కోసం రెండోసారి ఏర్పాటు చేసిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
తొలుత సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షల కోసం వచ్చిన ప్రతి ఒక్క మహిళను, వృద్ధులను లక్ష్మి రాజగోపాల్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. వారి వ్యక్తిగత, కుటుంబ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. కంటి చికిత్సలకు ఎంపికైన వారికి ధైర్యం చెబుతూ.. ఆపరేషన్ చేయించుకుంటే చూపు మళ్లీ స్పష్టంగా కనిపిస్తుందని భరోసా ఇచ్చారు. ఆపరేషన్లకు వెళ్లేవారు ఎలాంటి టెన్షన్ పడకుండా, ప్రశాంతంగా ఉంటేనే సర్జరీ విజయవంతం అవుతుందన్నారు. ఆపరేషన్ అవసరం లేని వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.
సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా వేలమందికి లబ్ధి: ఇప్పటివరకు సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో 9,766 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, వారిలో 2,198 మందికి విజయవంతంగా ఆపరేషన్లు పూర్తి చేయించామని లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. అలాగే 4,227 మందికి ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశామన్నారు. ఇప్పటికే వేలమందికి చూపు ప్రసాదించామని, ముందు ముందు ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామని స్పష్టం చేశారు. ఫౌండేషన్ ఎల్లప్పుడూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కట్టుబడి ఉంటుందని, ఆపరేషన్లకు ఎంపికైన వారు అపోహలు వీడి ముందుకు రావాలని కోరారు.
స్వయంగా భోజనాలు వడ్డించిన లక్ష్మి రాజగోపాల్ రెడ్డి: వైద్య శిబిరానికి వచ్చిన రోగులు, వారి సహాయకుల కోసం ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి స్వయంగా వృద్ధులకు, మహిళలకు భోజనాలు వడ్డించి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

