IND vs AFG TEST | ఆఫ్ఘాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టీమిండియా..
IND vs AFG TEST | ఆఫ్ఘాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టీమిండియా..
- అరంగేట్రంలోనే సుతార్ మ్యాజిక్!
న్యూచండీగఢ్ వేదికగా జరుగుతున్న భారత్-ఆఫ్ఘనిస్థాన్ ఏకైక టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 564/8 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. అనంతరం బౌలింగ్‌లోనూ చెలరేగి ఆఫ్ఘనిస్థాన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆఫ్ఘన్ జట్టు 39.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఆఫ్ఘాన్ జజట్టు భారత్ కంటే 451 పరుగులు వెనుకబడి ఉంది.
భారత్ భారీ స్కోరు ముందు ఆఫ్ఘన్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. రహ్మత్ షా (43*) ఒంటరి పోరాటం చేస్తుండగా, మిగతా బ్యాటర్లు భారత బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్లు అబ్దుల్ మాలిక్ (16), సెదీకుల్లా అతల్ (17) కొంతసేపు నిలిచినా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. గర్బాజ్ (12), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (20), అఫ్సర్ జజాయ్ (3) కూడా విఫలమయ్యారు.
అరంగేట్రంలోనే సుతార్ సంచలనం
భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేస్తున్న లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ మనవ్ సుతార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 15.5 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గర్బాజ్, జజాయ్ వికెట్లతో ఆఫ్ఘన్ బ్యాటింగ్‌ను కుదేలు చేశాడు. అతడికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీసి ఒత్తిడి పెంచాడు.

ఫాలోఆన్ దిశగా ఆఫ్ఘన్
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ శతకాలతో అదరగొట్టగా. సాయి సుదర్శన్, రిషబ్ పంత్ ఇద్దరూ 81 పరుగులతో అర్ధశతకాలు నమోదు చేశారు. ఇక వాషింగ్ టన్ సుందర్ కూడా 52 నాటౌట్ హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ జట్టు 564 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ ఇంకా 451 పరుగులు వెనుకబడి ఉండటంతో ఫాలోఆన్ ముప్పు ఎదుర్కొంటోంది. మూడో రోజు ఉదయం భారత బౌలర్లు మిగిలిన వికెట్లను త్వరగా తీస్తే ఇన్నింగ్స్ విజయంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
