342 Veda-Pandits-Exams : వేదనండితుల అన్వేషణ Andhra Prabha Top Story
342 Veda-Pandits-Exams : వేదనండితుల అన్వేషణ Andhra Prabha Top Story
- 342 పోస్టుల భర్తీకి కసరత్తు
- 5,486 మంది దరఖాస్తులు
- జూన్ 8 నుంచి వేద పారాయణ పరీక్షలు
- విజయవాడ, సీతానగరంలో ప్రత్యేక పరీక్షా కేంద్రాలు
- పారదర్శక ఎంపికకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ
- ప్రతిభ ఆధారంగా నియామకాలు..
- అర్చకులు, ఇతర పోస్టుల భర్తీకి తదుపరి చర్యలు
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో)
342 Veda-Pandits-Exams : ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వేద పారాయణదారులు, అర్చకులు, పరిచారికులు, భజంత్రీలు తదితర ధార్మిక సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మొత్తం 342 పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 5,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడంతో ఈ నియామక ప్రక్రియపై విశేష ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వేద పారాయణదారుల పోస్టులకు సంబంధించిన మౌఖిక పరీక్షలను జూన్ 8 నుంచి 16 వరకు నిర్వహించేందుకు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
గత ఏడాది డిసెంబర్ 17న విడుదలైన నోటిఫికేషన్‌కు అనూహ్య స్పందన లభించగా, ధార్మిక సేవల పట్ల యువతలో పెరుగుతున్న ఆసక్తి ఈ దరఖాస్తుల సంఖ్య ద్వారా స్పష్టమవుతోంది. వేద సంప్రదాయాల పరిరక్షణ, ఆలయ వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
మల్టీ జోన్–1 అభ్యర్థుల మౌఖిక పరీక్షలను విజయవాడలోని మాడపాటి సత్రంలో, మల్టీ జోన్–2 అభ్యర్థుల పరీక్షలను తాడేపల్లి సమీపంలోని సీతానగరంలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ (సీతా) భవనంలో నిర్వహించనున్నారు. సామవేదం, అధర్వణ వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం విభాగాల వారీగా పరీక్షల షెడ్యూల్ ఖరారు చేయబడింది.
ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఒక మల్టీ జోన్‌కు చెందిన అభ్యర్థుల పరీక్షల నిర్వహణ బాధ్యతలను మరో మల్టీ జోన్ అధికారులకు అప్పగించడం విశేషం. పర్యవేక్షణ కోసం డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను నియమించడంతో పాటు, ప్రతి ఇంటర్వ్యూ బోర్డులో ఇద్దరు వేద పారాయణదారులు, ఒక సహాయ కమిషనర్ స్థాయి అధికారిని సభ్యులుగా నియమించారు. దీంతో ఎంపిక ప్రక్రియ నిష్పాక్షికంగా సాగేందుకు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం, విద్యార్హతలు మరియు వేదార్హతలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలను వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. అవసరమైన పత్రాలు లేని వారికి పరీక్షలో ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.
వేద పండితుల పోస్టుల భర్తీకి విద్యార్హతలు, వేదార్హతలు, అనుభవం, మౌఖిక పరీక్షలో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించి మెరిట్ జాబితా రూపొందించనున్నారు. సమాన మార్కులు వచ్చిన సందర్భంలో వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ విధంగా రూపొందిన ర్యాంకుల ఆధారంగానే నియామకాలు చేపట్టబడతాయి.
వేద పారాయణదారుల పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన అనంతరం నోటిఫికేషన్లో పొందుపరిచిన అర్చకులు, పరిచారికులు, భజంత్రీలు మరియు ఇతర ధార్మిక సిబ్బంది పోస్టుల భర్తీని కూడా దశలవారీగా పూర్తి చేయనున్నట్లు దేవదాయ ధర్మదాయ శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్ర దేవాలయాల్లో ఖాళీగా ఉన్న ధార్మిక సేవా పోస్టుల భర్తీకి మార్గం సుగమం కానుంది
