Dubai Nurses Crisis | దుబాయ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన కేరళ నర్సులు
Dubai Nurses Crisis | దుబాయ్‌లో ఉద్యోగాలు కోల్పోయిన కేరళ నర్సులు
Dubai Nurses Crisis | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారతీయ ఆరోగ్య సిబ్బందిపై పడింది. దుబాయ్‌లోని ఇరానియన్ ఆసుపత్రి కార్యకలాపాలు నిలిచిపోవడంతో వందలాది మంది భారతీయ నర్సులు, వైద్య సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయి అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని వారికి సహాయం అందించాలని కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ఇరానియన్ ఆసుపత్రి మూతపడటంతో అక్కడ పనిచేస్తున్న నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉపాధిని కోల్పోయారని సీఎం తన లేఖలో పేర్కొన్నారు. ఉద్యోగ నష్టంతో పాటు వీసా సంబంధిత సమస్యలు కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సందర్శకుల వీసాల జారీపై పరిమితులు విధించడంతో అనేక కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయని వివరించారు.
కొంతమంది నర్సుల యూఏఈ నివాస అనుమతుల గడువు త్వరలో ముగియనుందని, కొత్త ఉద్యోగాలు దొరకకపోతే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
దుబాయ్‌లో ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న భారతీయ నర్సులు కరోనా మహమ్మారి సమయంలోనూ కీలక పాత్ర పోషించారని సతీశన్ గుర్తు చేశారు. స్థానిక చట్టాలను గౌరవిస్తూ విధులు నిర్వహించిన ఈ సిబ్బంది ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
యూఏఈలో స్థిరపడిన అనేక కుటుంబాల పిల్లలు అక్కడే విద్యనభ్యసిస్తున్నారని, వారికి రుణాలు, ఇతర ఆర్థిక బాధ్యతలు కూడా ఉన్నాయని సీఎం లేఖలో తెలిపారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిశీలించి, భారత విదేశాంగ శాఖతో పాటు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ద్వారా పరిష్కారం చూపించాలని ప్రధాని మోదీని కోరారు.
