Raghava Lawrence | జూన్ 11న కీలక ప్రకటన అంటూ ట్వీట్‌

Raghava Lawrence | జూన్ 11న కీలక ప్రకటన అంటూ ట్వీట్‌

Raghava Lawrence | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్‌ రాఘవ లారెన్స్‌ రాజకీయ ప్రవేశంపై తమిళ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. తమిళగ వెట్రి కళగం (టీవీకే) తరఫున తిరుచ్చి ఈస్ట్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో ఆయన పోటీ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో లారెన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించి ఆసక్తికర ప్రకటన చేశారు.

ప్రస్తుతం తాను ‘బెంజ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని లారెన్స్‌ తెలిపారు. ఆ షూటింగ్‌ షెడ్యూల్‌ జూన్‌ 10న ముగియనుందని, అనంతరం తన తల్లి ఆశీస్సులతో జీవితంలో తీసుకోబోయే అత్యంత కీలక నిర్ణయాన్ని జూన్‌ 11న ఉదయం 9.30 గంటలకు ప్రకటిస్తానని వెల్లడించారు. అయితే ఆ నిర్ణయం రాజకీయాలకు సంబంధించినదేనా అన్న దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి. జోసెఫ్‌ విజయ్‌ తాను గెలిచిన రెండు స్థానాల్లో ఒకటైన తిరుచ్చి ఈస్ట్‌ స్థానానికి రాజీనామా చేశారు. పెరంబూర్‌ స్థానాన్ని కొనసాగించేందుకు విజయ్‌ నిర్ణయించుకోవడంతో, తిరుచ్చి ఈస్ట్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించబడింది. ఎన్నికల సంఘం ఆ స్థానానికి ఆరు నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో తిరుచ్చి ఈస్ట్‌ ఉపఎన్నికలో టీవీకే బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తమిళ మీడియాలో చర్చ సాగుతోంది. ప్రజల్లో మంచి గుర్తింపు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రత్యేకమైన పేరు సంపాదించుకున్న రాఘవ లారెన్స్‌ పేరు కూడా ఈ ప్రచారంలో వినిపిస్తోంది. లారెన్స్‌ నటుడిగా, కొరియోగ్రాఫర్‌గా మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు పొందారు. గతంలో సామాజిక సేవకు గాను ఆయనకు గౌరవ డాక్టరేట్‌ కూడా లభించింది.

అయితే రాఘవ లారెన్స్‌ నిజంగా టీవీకే తరఫున పోటీ చేస్తారా? లేక తన సినిమా, సేవా కార్యక్రమాలు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని ప్రకటిస్తారా? అనే దానిపై స్పష్టత జూన్‌ 11న రానుంది. దీంతో లారెన్స్‌ ప్రకటనపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Leave a Reply