తిరుపతిలో ఘనంగా యోగాంధ్ర ప్రారంభం
తిరుపతిలో ఘనంగా యోగాంధ్ర ప్రారంభం
ఎస్వీ జూ పార్క్లో 2,500 మందితో భారీ యోగా కార్యక్రమం
జూన్ 21 వరకు జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు
చంద్రగిరి కోటలో ప్రత్యేక యోగా వేడుకలకు సన్నాహాలు
ఉత్సాహంగా యోగాసనాలు చేసిన అధికారులు, విద్యార్థులు, మహిళలు
తిరుపతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమానికి తిరుపతి జిల్లాలో ఘనంగా శ్రీకారం చుట్టారు. ఆదివారం ఎస్వీ జూ పార్క్లో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో సుమారు 2,500 మంది అధికారులు, ఉద్యోగులు, యువత, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగా గురువుల మార్గదర్శకత్వంలో అందరూ వివిధ యోగాసనాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, డీఆర్వో నరసింహులు, ప్రజాప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు మాట్లాడుతూ, యోగా అనేది ఒక రోజు నిర్వహించే కార్యక్రమం కాదని, ప్రతి వ్యక్తి జీవితంలో భాగంగా మారాల్సిన నిత్య సాధనమని అన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో యోగాంధ్ర–2026 కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు యోగాను అలవాటు చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అవలంబించవచ్చని సూచించారు.

జూన్ 7 నుంచి 21 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలు, సచివాలయాలు, మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జూన్ 12న చారిత్రాత్మక చంద్రగిరి కోటలో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ కోసం జిల్లాలో 200 మంది మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేసినట్లు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి దోహదపడే సమగ్ర జీవన విధానమని పేర్కొన్నారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజుకు కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం చివర్లో అధికారులు, విద్యార్థులు, మహిళలు, యువత ఉత్సాహంగా యోగాసనాలు చేశారు. యోగా గురువుల సూచనల మేరకు వివిధ ఆసనాలను అభ్యసిస్తూ ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన పెంపొందించుకున్నారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, పర్యాటక శాఖ రీజినల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్ధన్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
