TG20 Mega Auction | రామోజీ ఫిలిం సిటీలో నిర్వ‌హణ‌

TG20 Mega Auction | రామోజీ ఫిలిం సిటీలో నిర్వ‌హణ‌

TG20 Mega Auction | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమైంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ ఆధారిత టీజీ20 క్రికెట్ లీగ్కు సంబంధించిన ఆటగాళ్ల మెగా వేలం నేడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. జూన్ 21 నుంచి ప్రారంభమయ్యే ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పాల్గొననున్నాయి. ఆటగాళ్ల వేలం కోసం హెచ్‌సీఏ పరిధిలో 1,300 మందికిపైగా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. వీరిలో నుంచి ఎనిమిది ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకోనున్నాయి.

ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా 20 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టుకు గరిష్టంగా రూ.60 లక్షల పర్స్ కేటాయించగా, కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయాలనే నిబంధన ఉన్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్లను ఏ ప్లస్‌, ఏ, బీ, సీ1, సీ2 విభాగాలుగా వర్గీకరించనున్నారు. ఈ వేలంలో భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది. వీరిపై ఫ్రాంచైజీలు భారీ ఆసక్తి చూపే అవకాశముందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

టీజీ20 అరంగేట్ర సీజన్ జూన్ 21న ప్రారంభం కానుంది. మొత్తం 21 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో 32 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ లీగ్ ద్వారా తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్లకు మంచి వేదిక లభిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

Leave a Reply