Andhra Pradesh Monsoon | రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు
Andhra Pradesh Monsoon | రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాలు
Andhra Pradesh Monsoon | రానున్న రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరణ
ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం
పిడుగులతో వర్షాలు.. కొన్ని చోట్ల వడగాల్పులు
Andhra Pradesh Monsoon | అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రజలకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు శనివారం రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను తాకాయని పేర్కొంది. రానున్న రెండు మూడు రోజుల్లో రుతుపవనాలు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎండ వేడిమితో అల్లాడిన ప్రజలకు నైరుతి రాకతో ఉపశమనం కలగనుంది.
ఈ ఏడాది వర్షపాతం తక్కువ
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో కురిసే మొత్తం వర్షపాతం సాధారణ స్థాయి కంటే కొంత తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అయితే, స్థానిక వాతావరణ మార్పుల వల్ల కురిసే వర్షాలు ఈ లోటును కొంత మేరకు భర్తీ చేసే అవకాశం ఉందంది. ఈసారి రుతుపవనాల గమనంలో తరచూ విరామాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసి, మరికొన్ని రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. రైతులు ఈ మార్పులను గమనించి, తదనుగుణంగా తమ పంట ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో రాష్ట్రంలో వర్షపాతం కొన్ని జిల్లాల్లో ఎక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం
రాయలసీమను తాకిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ఆదివారం పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. కాగా, ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో 12 మండలాలు, విజయనగరం 22, మన్యం 12, అల్లూరి 1, పోలవరం 2, విశాఖ 1, కాకినాడ 8.. మొత్తంగా 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ముఖ్యంగా పోలవరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కర్నూలు, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, వైఎస్ఆర్ కడప, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు.
నేడు 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు.
శనివారం కృష్ణా జిల్లా పెదపారుపూడి, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 44 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43.9, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 43.4, అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, నెల్లూరు జిల్లా గూడూరు, తిరుపతి జిల్లా ఓజిలిలో 43.2, మన్యం జిల్లా నవగాంలో 43.1, బాపట్ల జిల్లా కారంచేడు, విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలసలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
రాష్ట్రంలో విభిన్న వాతావరణం
రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
