Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుపై రైతుల మక్కువ.. విస్తరిస్తున్న తోటలు
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుపై రైతుల మక్కువ.. విస్తరిస్తున్న తోటలు
Oil Palm Cultivation |అమరావతి, ఆంధ్రప్రభ : మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి కనబరుస్తున్నారు. సంవత్సరానికి నిఖరంగా ఆదాయం లభించే పంటలపై అన్వేషణ చేస్తున్నారు. మాగాణి, మెట్ట, వాణిజ్య పంటలపై విసిగి.. వేసారిన రైతులు పామా యిల్ సాగుపై మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటి వరకు కోస్తాలోని గోదావరి జిల్లాలకే పరిమితమైన పామాయిల్ పంట ఇపుడు గుంటూరు, పల్నాడు, ప్రకాశం తదితర జిల్లాల రైతులు సైతం సాగుచేయడానికి సన్నద్ధమవుతున్నారు.
ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వంద శాతం రాయితీతో ఆయిల్ పామ్ మొక్కలు పంపిణీ చేస్తోంది. నీటి వసతి ఉన్న రైతులు ఈ పంటను సాగు చేస్తే లాభాలు పొందవచ్చని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అంతే కాకుండా, ఎరువులు ఇతర అవసరాల కోసం హెక్టారుకు రూ.5,250 సాయం అందిస్తుంది. దీంతో రైతులు ఈ పంటను సాగుచేసేందుకు మొగ్గుచూపిస్తున్నారు.
సాగులో దేశంలోనే అగ్రగామి
రాష్ట్రంలో 1.45 లక్షల హెక్టార్లలో పామాయిల్ సాగవుతుండగా ఇది దేశంలోనే అగ్రగామిగా ఉంది. అయితే ఇప్పటి వరకు పామాయిల్ తోటలలో 70శాతం పైగా వాటాతో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. కృష్ణ, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా సాగుచేస్తున్నారు.
ఒకసారి నాటిన తర్వాత ఈ పంట 25 నుంచి 30 ఏళ్లపాటు దిగుబడి, స్థిరమైన ఆదాయం వనరును అందిస్తుంది. రైతులు ఎకరానికి 8 నుంచి 12 టన్నుల తాజా పండ్ల గుత్తులను ఉత్పత్తి చేస్తారు. ఇందులో అరటి, కోకో, కూరగాయలు, పప్పుధాన్యాల వంటి అంతర పంటలను కూడా పండించుకుని అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.
ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు సైతం పెట్టుబడులకు వెనుకాడకుండా తోటలు పెంచుతున్నారు. పెట్టుబడి వ్యయం కూడా రెట్టింపు అవుతోందని చెప్తున్నారు. మూడేళ్ల వయస్సు వచ్చాక తోటల్లో గెలలు కోస్తుండగా, ఆ లోపు ఎకరానికి కనీసం ఏటా రూ.25 వేలకు పైగా పెట్టుబడి వ్యయం అవుతోందని రైతులు వెల్లడిస్తున్నారు.
విస్తరిస్తున్న సాగు
ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన యంత్రాలను రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది. వీటిలో మినీ ట్రాక్టర్ ట్రాలీ, గెలల్ని కట్ చేసే కత్తులు, చాప్ కట్టర్లు ఇస్తారు. దేశంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగు అత్యధికంగా ఉంది. రెండు ఉభయ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జిల్లాలోనూ ఇటీవల సాగు పెరిగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పామాయిల్ మొక్కలను రైతులకు ఉచితంగా సరఫరా చేస్తుండగా, డ్రిప్ పరికరాలను సైతం రాయితీపై అందిస్తోంది. ఆయిల్ పామ్ సాగుకు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తోంది. ఆయిల్ పామ్ సంబంధించి రైతుల కోసం వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. మొక్కలు వేసిన తర్వాత నాలుగో ఏడాది నుంచి పంట చేతికి వస్తుంది. అలా 25 ఏళ్లపాటు దిగుబడి ఉంటుంది. పంట మార్కెట్లో టన్ను ధర రూ.18,500 నుంచి రూ.23,000 వరకు ఉంటుంది.
