Stree Ride | వినూత్న ప్రాజెక్టును ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
Stree Ride | వినూత్న ప్రాజెక్టును ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్
Stree Ride | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. విమెన్ సేఫ్టీ వింగ్, రాష్ట్ర రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘స్త్రీ రైడ్’ ప్రాజెక్టును హైదరాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ-బైక్స్, ఈ-ఆటోలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు తొలి విడతలో 55 మంది మహిళలను ‘స్త్రీ రైడర్లుగా’ ఎంపిక చేశారు. అంబర్‌పేట పోలీస్ లైన్స్‌లో వారికి ద్విచక్ర, త్రిచక్ర వాహనాల డ్రైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ అందించారు. అనంతరం 55 మంది మహిళలకు డ్రైవింగ్ లైసెన్సులు కూడా అందజేశారు.
అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు సురక్షిత రవాణా సేవలు అందించడమే కాకుండా, రవాణా మరియు డెలివరీ రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. జొమాటో, స్విగ్గీ వంటి డెలివరీ సేవల్లో మహిళలు భాగస్వామ్యం కావడం సంతోషకరమని డీజీపీ పేర్కొన్నారు.
వచ్చే నాలుగు నెలల్లో మహిళా రైడర్ల సంఖ్యను మూడింతలు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మహిళల ఉపాధి, సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు.
