Kavitha Fire | తెలంగాణ అస్తిత్వం కోసం మళ్లీ ఉద్యమం..
Kavitha Fire | తెలంగాణ అస్తిత్వం కోసం మళ్లీ ఉద్యమం..
Kavitha Fire | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పేదల భూములను లక్ష్యంగా చేసుకుంటూ, బడా వ్యాపార వర్గాలకు వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల వ్యవహారంపై తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని కవిత పేర్కొన్నారు. దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన భూములను కొందరు అధికార పార్టీ నేతలు, ప్రభావశీల వర్గాలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు.

గత ప్రభుత్వంలో కేటీఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) కీలక పాత్ర పోషించారని, ఇప్పుడు కూడా రాష్ట్రంలో “కేటీఆర్ పాలనే” కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. అయితే ఈసారి కేటీఆర్ అంటే కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్ర పాలనలో కుటుంబ జోక్యం పెరిగిందని ఆరోపించారు.
కూకట్‌పల్లిలోని మంజీర కాలనీ వంటి ప్రాంతాల్లో పేదల ఇళ్లను కూల్చే హైడ్రా, పెద్ద నిర్మాణ సంస్థల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తోందని కవిత ప్రశ్నించారు. మూసీ నది పరిధిలో నిర్మితమవుతున్న కొన్ని భారీ భవనాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. కొన్ని ప్రముఖ బిల్డర్ల వెనుక అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు.
ప్రేమవతిపేట పెద్ద చెరువు పరిధిలో కోట్ల రూపాయల విలువైన భూములు ఆక్రమించబడ్డాయని కవిత ఆరోపించారు. ఉపగ్రహ చిత్రాలను ప్రదర్శిస్తూ గత అనుమతులకు విరుద్ధంగా చెరువు పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. నాగారం ప్రాంతంలోని చెరువుల భూముల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనుగోలు చేసిన భూముల వ్యవహారాన్ని కూడా కవిత ప్రస్తావించారు. కోడి చెరువు పరిధిలోని భూములకు సంబంధించిన రికార్డులపై సందేహాలు ఉన్నాయని, సంబంధిత అధికారులు వాటిని పరిశీలించాలని కోరారు. ఆక్రమణలు నిరూపితమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఉద్యమ స్ఫూర్తిపై ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని కవిత హెచ్చరించారు. వేలాది మంది ఉద్యమకారుల పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, భూములు, వనరులను కాపాడేందుకే తమ పార్టీ పనిచేస్తోందని స్పష్టం చేశారు.
కృష్ణా, గోదావరి జలాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పోరాటం చేయడం లేదని కవిత విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపలేదని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటా విషయంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్రంలోని వివిధ ప్రజా సమస్యలపై ఇష్యూ ఆధారిత పాదయాత్రలు చేపట్టనున్నట్లు కవిత ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీదేవిపల్లి బ్యారేజీ సాధన కోసం త్వరలోనే పాదయాత్ర ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములను ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వెల్లడించారు.
