ఫైనల్‌కు దూసుకెళ్లిన నిజామాబాద్..

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : బి డివిజన్ టూ డేస్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్ మ్యాచ్‌లో నల్గొండ జిల్లా జట్టుపై 39 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన నిజామాబాద్ జిల్లా జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కెప్టెన్ జి. విక్రం నాయక్ 33 పరుగులు చేయగా, శ్రీకర్ రెడ్డి 44 పరుగులు, విక్రాంత్ రెడ్డి 23 పరుగులు చేసి జట్టుకు పోటీ స్కోరును అందించారు.

148 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నల్గొండ జిల్లా జట్టును నిజామాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. ప్రత్యర్థి జట్టును 109 పరుగులకే ఆలౌట్ చేసి ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేశారు.

బౌలింగ్‌లో లలిత్ రెడ్డి ఐదు వికెట్లు సాధించి మ్యాచ్‌ను మలుపుతిప్పగా, రయ్యాన్ బిన్ అబ్దుల్లా రెండు వికెట్లు, ఋత్విక్ రావు ఒక వికెట్, కెప్టెన్ జి. విక్రం నాయక్ ఒక వికెట్ తీశారు. ఈ టోర్నీలో లలిత్ రెడ్డి రెండోసారి ఐదు వికెట్లు సాధించడం విశేషం. కీలక మ్యాచ్‌ల్లో అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నారు.

ఈ విజయంతో నిజామాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

ఈ సందర్భంగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం. వెంకట్ రెడ్డి, కోశాధికారి కె. శ్రీనివాస్ రావు, జాయింట్ సెక్రటరీ-కమ్-కోచ్ ఎ. సురేష్ బాబు జట్టు సభ్యులను అభినందించారు. ఫైనల్‌లో కూడా ఇదే జోరును కొనసాగించి టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. నిజామాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరుకోవడం జిల్లా క్రికెట్ చరిత్రలో మరో గర్వకారణమని పేర్కొన్నారు.

Leave a Reply