Koheda Market | అంతర్జాతీయ ప్రమాణాలతో రైతులకు ఆధునిక మార్కెట్

Koheda Market | అంతర్జాతీయ ప్రమాణాలతో రైతులకు ఆధునిక మార్కెట్

Koheda Market | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : రాష్ట్ర రైతులకు ఆధునిక మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే దిశగా కోహెడలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటలకు శంకుస్థాపన చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో మార్కెట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మార్కెట్ నిర్మాణం కోసం 239 ఎకరాల భూమి అందించిన రైతులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మార్కెట్ ద్వారా రైతులకు మెరుగైన ధరలు, నిల్వ, రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఎరువుల కొరత ఏర్పడిందని, అంతర్జాతీయ పరిస్థితులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్నాయని తుమ్మల అన్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి, పామాయిల్ దిగుమతులపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయ రైతులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. విదేశాల నుంచి తక్కువ ధరకు వస్తున్న ఉత్పత్తుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

ధాన్యం కొనుగోళ్ల సమయంలో డీజిల్ సరఫరా సమస్యల కారణంగా కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.లక్ష కోట్లకు పైగా జమ చేసిందని మంత్రి వెల్లడించారు.

Leave a Reply