వడ్ల కొనుగోలులో ఆలస్యం.. రైతుల ఆగ్రహం
సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు కుప్పలుగా వడ్లు పేరుకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డు ఎక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల పరిధిలోని గుడిమల్కాపురం వడ్ల కొనుగోలు కేంద్రం ఆవరణలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.నెలలు గడుస్తున్న వడ్ల కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు.
చౌటుప్పల్ నారాయణపూర్ రహదారిపై కర్రలు , రాళ్లు వేసి రోడ్డును దిగ్బంధం చేసి బైఠాయించారు. తక్షణమే వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని లారీలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.సమాచారం అందుకున్న చౌటుప్పల్ తహసీల్దార్ వీరాబాయి సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.రోజుకు మూడు లారీల చొప్పున ధాన్యం తరలించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసనను నిర్వహించుకున్నారు.
