Financial Trap |మొదటి జీతం తెచ్చిన ఆనందం.. అదే జీవితాన్ని ఎలా మార్చేసింది?

Financial Trap | మొదటి జీతం తెచ్చిన ఆనందం.. అదే జీవితాన్ని ఎలా మార్చేసింది?

Financial Trap | కలల జీతం.. అప్పుల పద్మవ్యూహం!
విలాసాల వలలో పడిన యువ ఉద్యోగి
EMIల మాయలో పెరిగిన అప్పుల భారం
నిద్ర పట్టని రాత్రులు.. ఆర్థిక ఒత్తిడి
సమాజానికి అద్దం పట్టే విక్రమ్ కథ
మార్పుతో మళ్లీ జీవితంలో కొత్త వెలుగు

Financial Trap | రాజమహేంద్రవరం, ఆంధ్ర‌ప్ర‌భ : రాజమహేంద్రవరం పట్టణంలో పుట్టి పెరిగిన విక్రమ్‌కి హైదరాబాద్‌లో IT ఉద్యోగం వచ్చింది. నెలకు రూ. 45,000 జీతం. అంతపెద్ద మొత్తం చేతిలో చూడటం… అంటే.. తాను చేసిన పనికి అంత ప్రతిఫలం చూడటం అదే మొదటిసారి. మొదటి జీతం వచ్చిన రోజు.. అతని కళ్ళలో ఆనందం కనిపించింది. అతని మనసంతా పులకించిపోయింది. ఇన్నాళ్ళూ అమ్మ, నాన్నల నుండి చిన్న చిన్న అవసరాలకు వందా, రెండు వందలూ చేయిచాచి అడిగే వాడు. ఇప్పుడు ఏకంగా రూ.45,000 తన చేతుల్లో ఉంది. అదీ తన స్వార్జితం. అయితే, అంత జీతం ఏం చేసుకోవాలో కూడా స్టార్టింగ్ లో అర్థం కాలేదు. ఆ జీతం చూసిన ఆనందంలో ఎలా ఖర్చు చేయాలన్న విచక్షణ కోల్పోయాడు. అకౌంట్ లో ఇంత డబ్బుండగా ఖర్చు చేయడానికి ఆలోచన ఎందుకు? అనే భావన అతనిలోకి వచ్చేసింది.

కొత్త నగరం, కొత్త స్వేచ్ఛ, చేతి నిండా డబ్బు… ఇవన్నీ విక్రమ్‌ని వేరే లోకంలోకి తీసుకెళ్ళాయి. కానీ, అతనికి తెలియదు ఈ ఆర్థిక సుడిగుండంలో అడుగుపెట్టడం తేలిక, బయటపడడం చాలా కష్టమని.

విలాసాల వలలో…

మొదటి నెలలోనే ఐఫోన్ కొన్నాడు. దాని ధర లక్షా 20వేల రూపాయలు. మొత్తం ఒకేసారి కట్టక్కర్లేదు కదా.. ఆ ఫోన్‌కి EMI పెట్టాడు. తను పనిచేసే ఆఫీసులో కొలీగ్స్‌ అందరూ అదే వాడుతున్నారు. కాబట్టి తనకూ అది ఉండాల్సిందే అనుకున్నాడు. అందుకే తన జీతంలోంచి ఫస్ట్‌ ఖర్చు ఐఫోన్‌ పై పెట్టాడు.

రెండో నెల జీతం వచ్చింది. అకౌంట్‌లో డబ్బులున్నాయ్‌. ఇప్పుడు వాడుతున్న బైక్‌ నార్మల్‌ అనిపించింది. అలా కాదు.. తన స్టేటస్‌ చూసేవాళ్లకు తెలియాలి కదా.. అందుకే బుల్లెట్‌ కొన్నాడు. దానికీ ఉందిగా EMI మంత్రం. మరో రూ.8,500 బుల్లెట్‌ EMIకి ఫిక్స్‌ చేసేశాడు.

మూడో నెల… రెండు EMIలు కట్టాక కూడా అకౌంట్‌లో డబ్బులు వెక్కిరిస్తున్నాయ్‌. రూమ్‌లో రెండు పూటలా వంట అంటే టైమ్‌ వేస్ట్‌ అనుకున్నాడు. ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే నిమిషాల్లో డెలివరీ చేయగలిగే Zomato, Swiggy వంటి యాప్స్‌ ఉన్నాయ్‌ కదా… అంతే… వాటికి అడిక్ట్‌ అయిపోయాడు.

Financial Trap

నాలుగో నెల.. రూమ్‌లో ఓ స్మార్ట్‌ టీవీ ఉండాల్సిందే అని డిసైడయ్యాడు. దానిక్కూడా EMI సెట్‌ చేశాడు.

ఐదో నెల… స్మార్ట్‌ టీవీ అయితే తీసుకున్నాడు. దానికి ఇంటర్నెట్ కనెక్షన్‌, డిష్‌ టీవీ, OTT subscriptions లేకుండా అది వృథా అనేది అర్థమయ్యింది. ఇంకే… అవి కూడా వచ్చేశాయి. Netflix, Amazon Prime, Hotstar, Sony LIV ఇలా క్రేజీ ఉన్నవన్నీ సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్నాడు.

Financial Trap

ఆరోనెల… ఆఫీస్‌లో మెట్రో సిటిజన్‌ లుక్ ఉండాల్సిందే అనుకున్నాడు. అప్పటిదాకా వాడుతున్నవి కాకుండా బ్రాండెడ్‌ డ్రెస్సెస్ షాపింగ్‌ చేశాడు. Louis Philippe చొక్కాలు, Levi’s జీన్స్, Rare Rabbit బెల్టులు, Adidas షూస్‌.. ఇలా అతని లుక్కును పూర్తిగా మార్చేసుకున్నాడు.

నెలలు గడుస్తున్నకొద్దీ విక్రమ్‌ తన స్టైల్, లైఫ్‌ స్టైల్‌ మార్చేసుకుంటున్నాడు. ఆ మార్గంలో ఆర్థిక అభిమన్యుడిలా మారిపోయాడు. ఎలాగంటే… విక్రమ్‌ నెలజీతం రూ.45,000, నెలవారీ ఖర్చులు, EMI లు చూసుకుంటే.. రూ.52,000, ఇక, పొదుపు మాట దేవుడెరుగు… జీతం లోటు లేకుండా చూసుకుంటే బెటర్ అన్న స్టేజీకి వచ్చాడు. అయితే, ఆశ్చర్యమేంటంటే ఇవేమీ అతనికి అప్పటికి తప్పుగానో, దుబారా ఖర్చుగానో, అనవసర ఖర్చు గానో అనిపించలేదు. “ఈ నెల కాస్త ఎక్కువైంది, వచ్చే నెల చూసుకుందాం” అని తనకు తానే సర్దిచెప్పుకుంటున్నాడు. కానీ అలా మొత్తం బిల్లు కట్టే ‘వచ్చే నెల’ ఎప్పుడూ రాలేదు.. ప్రతి నెలా అదే కథ. పైగా.. లోటు పెరుగుతూ పోతోంది.

అప్పుల పద్మవ్యూహం…

ఏడో నెలలో జేబు ఖాళీ అయింది. కొత్త ఖర్చు కోసం ఆలోచించడానికి కూడా ఏమీ లేదు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాడు కదా.. అప్పుడే బ్యాంకు నుండి క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ ఆఫర్‌ వచ్చింది. తన జీతానికి తగ్గట్టు లక్ష రూపాయల లిమిట్‌ ఇస్తామన్నారు. ఇంకేముంది.. అవసరానికి వాడుకోవచ్చని, క్రెడిట్‌ కార్డు తీసుకున్నాడు విక్రమ్.

స్టార్టింగ్‌లో చిన్న చిన్న ఖర్చులు. తర్వాత ఫ్రెండ్స్‌తో ట్రిప్స్‌. గోవా టూర్, వీకెండ్‌ కూర్గ్‌, ఇవన్నీ కూడా క్రెడిట్ కార్డుతోనే… బిల్లు వచ్చాక, వచ్చేనెల కట్టొచ్చులే.. అన్నది విక్రమ్ ఆలోచన. కానీ, జీతం బడ్జెట్‌ అంతే కదా… క్రెడిట్ కార్డు మినిమం Due మాత్రమే కట్టాడు. వడ్డీ రేటు యేడాదికి 36%. అవుట్‌స్టాండింగ్‌ రూ.80,000.

తొమ్మిదో నెలకు పరిస్థితి ముదిరింది. ఒక క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి మరో క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. అదీ సరిపోలేదు. పర్సనల్ లోన్‌ తీసుకున్నాడు. విక్రమ్‌ అప్పుల కథ అంతటితోనే ఆగలేదు. ఫ్రెండ్స్‌ దగ్గర కూడా అప్పులు తీసుకున్నాడు. ఉద్యోగం వచ్చిన తొమ్మిది నెలల్లో విక్రమ్ మొత్తం అప్పు రూ.3.5 లక్షలు దాటింది. ఇలా విక్రమ్‌ **’అప్పుల పద్మవ్యూహం’**లో చిక్కుకున్నాడు. మహాభారతంలో అభిమన్యుడు తెలుసుకదా.. యుద్ధతంత్రంలో భాగమైన పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసు. కానీ, ఆ పద్మవ్యూహం లోంచి ఎలా బయటపడాలో తెలియదు. ఇప్పుడు విక్రమ్ పరిస్థితి అచ్చం అలాగే ఉంది.

నిద్ర పట్టని రాత్రులు…

పదో నెల.. తనకు జాబ్‌ వచ్చి పదినెలలయ్యింది. విక్రమ్ లైఫ్‌ తలకిందులైంది. మార్నింగ్‌ బ్యాంకు నుండి కాల్‌, మధ్యాహ్నం రికవరీ ఏజెంట్ మెస్సేజ్‌, ఈవెనింగ్‌ ఫ్రెండ్‌ నుంచి తనకు ఇవ్వాల్సిన అప్పు గురించి ఫోన్‌. ఈ పరిస్థితుల్లో తాను ఆఫీసులో కూడా పనిమీద అంతకుముందులాగా కాన్సన్‌ ట్రేట్‌ చేయలేక పోతున్నాడు. అమ్మకి చెప్పాలంటే భయం. ఫ్రెండ్స్‌కి చెప్పాలంటే అవమానం. తన పరిస్థితి గురించి ఎవరికీ చెప్పుకోలేక.. మానసికంగా కుంగిపోయాడు. రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. ఇంత తక్కువ జీతంతో అంత పెద్ద అప్పు ఎలా తీరుతుంది? అనే ఆలోచన వెంటాడుతోంది.

విక్రమ్‌కి అప్పటికి కానీ అర్థం కాలేదు. ఆర్థిక పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసింది కానీ, అందులోంచి బయటపడే మార్గం తెలియలేదు. అప్పుడు భారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకొని బయటకు రాలేదు. ఇప్పుడు తాను ఆర్థిక పద్మవ్యూహంలో బందీ అయిపోయాను. అనే కనువిప్పు కలిగింది. అప్పటినుంచీ తినడం తగ్గించాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ జోలికి వెళ్లడం లేదు. ఒంటరిగా గది నాలుగు గోడల మధ్య కూర్చుని లెక్కలు వేసుకున్నాడు. ఎంతగా ఆలోచించినా, ఏ విధంగా లెక్కించినా అప్పు తీరే దారి కనిపించడం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో, ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

అద్దంలో సమాజం…

విక్రమ్ కేవలం ఒక వ్యక్తి కాదు.. అతను ఈ తరానికి ప్రతినిధి. అంటే.. నేటి యువత లైఫ్‌ స్టైల్‌కు, అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నవాళ్లకు కూడా రిప్రెజెంటేటివ్‌. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. మనదేశంలో సగటు పొదుపు రేటు కేవలం 10% నుంచి 15% మాత్రమే. అది కూడా క్రమంగా తగ్గిపోతోంది. 25 నుంచి 35 యేళ్ల వయసులో ఉన్న వాళ్లు దాదాపు 60% మంది క్రెడిట్ కార్డు అప్పుల్లో ఉన్నారు. ఇక, ఎమర్జెన్సీ ఫండ్‌ లేకుండా జీవించేవారు మనదేశంలో 75% పైనే కనిపిస్తారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో మరొకరి వెకేషన్‌ పోస్టులు చూసి… EMI పెట్టి మరీ తాము కూడా ట్రిప్‌ బుక్ చేసుకుంటున్నారు. పక్కింటివాళ్లు కొత్త కారు కొంటే.. నెల తిరిగేలోపు మనమూ కొనాలి. ఆఫీసులో కొలీగ్‌ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లాడు. నెక్ట్స్‌ సమ్మర్‌ లో మనమూ వెళ్లాలి. ఇలా.. పక్కవాళ్ల జీవితాన్ని చూసి తమ జీవితాన్ని బేరీజు వేసుకొని నడుపుతున్నవాళ్లే ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. “Yolo” (You Only Live Once – జీవితం ఒక్కసారే ఉంటుంది) పేరుతో భవిష్యత్తు గురించి పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుత క్షణాన్ని అనుభవించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే, ఇది దీర్ఘకాలంలో వ్యక్తిగత ఎదుగుదలకు, ఆర్థిక భద్రతకు, కెరీర్‌కు కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది.

ఇది ఒక్క విక్రమ్ సమస్య కాదు – ఇది ఈ తరం సమస్య.

మార్పు, మళ్ళీ జీవితం…

ఒకరకంగా డిప్రెషన్‌ స్టేజ్‌ లోకి వెళ్లిన విక్రమ్‌.. ఫైనాన్షియల్‌ ఎడ్యుకేటర్‌గా నాగురించి తెలుసుకున్నాడు. తాను ఉన్న పరిస్థితుల్లో సొల్యూషన్‌ దొరుకుతుందేమో అని నన్ను కాంటాక్ట్‌ చేశాడు. అపాయింట్‌మెంట్‌ తీసుకొని **’ది రూపీ కంపెనీ’**కి వచ్చాడు. ఎలాగూ పరిచయస్తుడిని కాదు కాబట్టి.. తన స్టోరీ మొత్తం చెప్పేశాడు. అతని పరిస్థితి మొత్తం అర్థమయ్యింది. అతని ఫైనాన్షియల్‌ సిచ్యుయేషన్‌ కారణంగా మెంటల్‌గా కూడా డిస్టర్బ్‌ అయ్యే స్టేజీకి వచ్చాడని అర్థమయ్యింది. నేను గ్రహించిన వాస్తవాలతో విక్రమ్‌కు కొన్ని సొల్యూషన్‌ టిప్స్‌ చెప్పాను. వాటిని నిజాయితీగా ఫాలో అయితే, కచ్చితంగా బయటపడతావని అతనికి అర్థమయ్యేలా వివరించాను. అంతేకాదు.. అతనికి ఓ ‘టైమ్‌ ఫ్రేమ్‌’ కూడా ఫిక్స్‌ చేశాను. నాక్కూడా ఆశ్చర్యమేసిందేంటంటే అతను నా గైడెన్స్‌ను తూచ తప్పకుండా ఫాలో అయ్యాడు. విక్రమ్‌ కమిట్‌మెంట్‌ కారణంగా నేను ఫిక్స్‌ చేసిన ‘టైమ్‌ ఫ్రేమ్‌ లోపలే’ బయటపడిపోయాడు.

విక్రమ్‌ ఫాలో అయిన సొల్యూషన్స్‌

నన్ను కలిసి వెళ్లిన రోజు రాత్రే విక్రమ్‌ ప్లాన్‌ స్టార్ట్ చేశాడు. తనకు వచ్చే నెలజీతం, అప్పటికే పేరుకుపోయిన అప్పులు, ఖర్చులు, రోజువారీ లైఫ్‌ స్టైల్‌ అన్నీ నేను ఇచ్చిన ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. వాటిని తీర్చడానికి ఏమేం మార్గాలున్నాయో కూడా తనకు అవగాహన ఉన్నంత వరకూ రాసుకున్నాడు. మరుసటిరోజే లీవ్‌ పెట్టి ఊరెళ్లాడు. అమ్మకు జరిగిందంతా చెప్పుకున్నాడు. ఇకపై ఇలా చేయనని కూడా మాటిచ్చాడు. సరికొత్త ఫైనాన్షియల్‌ ప్లాన్‌ ఫాలో అవుతున్నానని, అందులో ఫస్ట్‌ స్టెప్‌ నీదగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నానని చెప్పాడు. కొడుకు ఇంత తొందరగా తప్పు తెలుసుకొని మారుతుండటం గర్వంగా అనిపించింది. అమ్మ తాను చిట్టీవేసి పోగుచేసిన రూ.50,000 కొడుకు చేతిలో పెట్టింది. మరుసటిరోజే విక్రమ్‌ నాదగ్గరికి వచ్చాడు. సార్… గణేష్‌ గారూ.. మీ గైడెన్స్‌ సూపర్‌ సర్. ఫస్ట్‌ స్టెప్‌ సక్సెస్‌. అమ్మ రూ.50,000 ఇచ్చింది అన్నాడు.

గుడ్‌ గోయింగ్‌.. కానీ, మళ్లీ నువ్వు ఎక్కడా ట్రాక్‌ తప్పకూడదు అని సున్నితంగా వార్నింగ్‌ ఇచ్చాను. అప్పుడే ‘debt consolidation plan’ సెట్‌ చేశాను. దాన్ని ఫాలో కావాలని సలహా ఇచ్చాను. అంతేకాదు.. అతను ఇంకా ఏమేం చేయాలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను.

అమ్మ ఇచ్చిన డబ్బులతో ముందుగా ఒక ఫ్రెండ్‌కు ఇవ్వాల్సిన అప్పు తీర్చాడు. తనకు అప్పటిదాకా ఉన్న subscriptions అన్నీ క్యాన్సిల్‌ చేశాడు. తన మొబైల్ లో ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ డిలీట్‌ చేశాడు. వంట నేర్చుకున్నాడు. మరుసటినెల వచ్చేసరికి విక్రమ్‌లో కాన్ఫిడెన్స్‌ పెరిగింది. అప్పులన్నీ కలిపి ఒకే EMI గా మార్చేశాడు. ప్రతినెలా EMI కట్టడం, పొదుపు పాటించడం, అదనపు అప్పులు చేయకుండా ఒళ్లు దగ్గర పెట్టుకోవడం నేర్చుకున్నాడు. యేడాదిన్నరకే పూర్తిగా అప్పుల నుంచి ఫ్రీ అయ్యాడు. అప్పులనుంచి బయటపడిన ఆరోజు నా దగ్గరికి వచ్చినప్పుడు అతనిలో చూసిన సంతోషం ఇప్పటికీ నా కళ్లల్లో మెదులుతూనే ఉంది. ఎప్పటికీ ఉంటుంది కూడా…
ఇకపై, ఆరోజే విక్రమ్‌ పొదుపు మొదలెట్టాడు.

ఇదీ కలియుగపు ఆర్థిక అభిమన్యుడు విక్రమ్ కథ.

అట్లూరి గణేష్‌
ఫైనాన్షియల్‌ ఎడ్యుకేటర్‌,
ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌, రచయిత.

CLICK HERE TO READ Rahul Gandhi | గ్రేట్ నికోబార్ అంశంపై కేంద్రాన్ని నిలదీసిన రాహుల్

CLICK HERE TO READ MORE

Leave a Reply