ఎట్టకేలకు గోల్డ్ లోన్ బాధితులకు బంగారం పంపిణీ

ఎట్టకేలకు గోల్డ్ లోన్ బాధితులకు బంగారం పంపిణీ

ఫలించిన రిలే నిరాహార దీక్షలు.. 9 నెలల తర్వాత ఉపశమనం

చెన్నూర్, ఆంధ్రప్రభ:

మంచిర్యాల జిల్లా చెన్నూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ-2) శాఖలో గత ఏడాది ఆగస్టులో జరిగిన గోల్డ్ లోన్ గోల్‌మాల్ ఘటన బాధితులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. తొమ్మిది నెలల నిరీక్షణ అనంతరం గురువారం సాయంత్రం బ్యాంకు అధికారులు గోల్డ్ లోన్ బాధితులకు వారి బంగారు ఆభరణాలను ఒక్కొక్కరికి అందజేశారు.

గత ఏడాది ఆగస్టు 20న బ్యాంకు క్యాషియర్ నరిగే రవి, కింది స్థాయి సిబ్బందితో కలిసి ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం, నగదును అక్రమంగా అపహరించిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కోట్లాది రూపాయల విలువైన బంగారం, నగదు దోపిడీకి గురైన విషయం అప్పట్లో వెలుగులోకి వచ్చింది.

ఘటన అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టి దోపిడీకి గురైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో భద్రపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు ఆస్తులను బ్యాంకు అధికారులకు అప్పగించారు.

అయితే బాధితులకు బంగారం తిరిగి అందజేయడంలో బ్యాంకు అధికారులు తీవ్ర జాప్యం చేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ అవసరాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి పొందేందుకు నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో బాధితులు గత నాలుగు రోజులుగా బ్యాంకు ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీంతో స్పందించిన బ్యాంకు ఉన్నతాధికారులు చెన్నూరుకు చేరుకుని సమస్యను పరిష్కరించే చర్యలు చేపట్టారు.

తొమ్మిది నెలల వడ్డీని మినహాయించి బాధితులకు వారి బంగారు ఆభరణాలను తిరిగి అందజేయడం ప్రారంభించారు. దీంతో గోల్డ్ లోన్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ తమకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు.

Leave a Reply