దోస్త్ మూడో దశ అడ్మిషన్లకు చివరి అవకాశం

దోస్త్ మూడో దశ అడ్మిషన్లకు చివరి అవకాశం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, ఇది విద్యార్థులకు చివరి అవకాశమని కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. ప్రవీణ తెలిపారు.

దోస్త్ రెండో దశలో సీట్లు పొందిన విద్యార్థులు తమ ప్రవేశాలను ఖరారు చేసుకునేందుకు ఆన్‌లైన్ సెంటర్లు లేదా మీసేవ కేంద్రాల ద్వారా రేపటిలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని సూచించారు. గడువులోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని పక్షంలో కేటాయించిన సీటు రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన బాలికలకు అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా సంవత్సరానికి రూ.30 వేల స్కాలర్‌షిప్ అందుతుందని తెలిపారు. అలాగే మలబార్ గోల్డ్ ఆధ్వర్యంలో రూ.10 వేల వరకు ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు కూడా లభిస్తాయని వివరించారు.

దోస్త్ మూడో దశ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 15వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని, డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ప్రవేశాలు పొందాలని సూచించారు. అడ్మిషన్లకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా కళాశాలను సంప్రదించాలని కోరారు.

తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంగారెడ్డి జిల్లాలో ఐడీ కళాశాలగా గుర్తింపు పొందిందని, అలాగే జాతీయ స్థాయిలో నాక్ ‘ఏ ప్లస్’ గ్రేడ్ సాధించి నాణ్యమైన విద్య అందిస్తున్న సంస్థగా నిలిచిందని ప్రొఫెసర్ ప్రవీణ తెలిపారు.

Leave a Reply