హాస్టల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలి

హాస్టల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలి

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తూ చదువుతున్న పదో తరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా వసతి సంక్షేమ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. గురువారం చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి ప్రజా పరీక్షల ఫలితాలు, వసతి గృహాల నిర్వహణ, విద్యార్థుల సంక్షేమం తదితర అంశాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి ఎస్.కె. రబ్బానీతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక అధికారుల ద్వారా మరింత విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వసతి గృహాల నిర్వహణ, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం పరిశుభ్రత, మౌలిక వసతులు, వార్డెన్లు మరియు వసతి సంక్షేమ అధికారుల పనితీరు, అధ్యయన వేళల నిర్వహణ, యోగా, క్రమశిక్షణ, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల సంక్షేమం, అలాగే మద్యం, మత్తు పదార్థాల వినియోగ నియంత్రణ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని వసతి గృహాలను ఎ, బి, సి, డి కేటగిరీలుగా వర్గీకరించనున్నట్లు తెలిపారు.

ఈ వర్గీకరణ విధానాన్ని 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తీసుకువస్తామని, జూన్ నెల నుంచే ఆయా వసతి గృహాల పనితీరును నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన పరిపాలనా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. మూడు నెలల అనంతరం మరోసారి సమీక్ష నిర్వహించి, అప్పటికీ పనితీరులో ఆశించిన స్థాయిలో మెరుగుదల కనిపించని లేదా తనిఖీల్లో మళ్లీ లోపాలు గుర్తించిన వసతి గృహాల సంక్షేమ అధికారులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాల సంక్షేమ అధికారులు విద్యార్థుల విద్యా ఫలితాల మెరుగుదల, క్రమశిక్షణ, పరిశుభ్రత, భద్రత, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి వసతి గృహాలను ఆదర్శవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

విద్యార్థుల అభ్యాస స్థాయిని పెంచేందుకు క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని, ప్రతి విద్యార్థి పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 49 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తూ విద్యనభ్యసించిన విద్యార్థులు 2026 పదో తరగతి ప్రజా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే జిల్లా సగటు ఉత్తీర్ణత శాతం కంటే తక్కువ ఫలితాలు సాధించిన 15 వసతి గృహాల సంక్షేమ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.

తక్కువ ఫలితాలకు కారణాలను గుర్తించి వెంటనే సరిదిద్దాలని, వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని వసతి గృహాలు జిల్లా సగటు కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశుభ్రమైన వాతావరణం, సురక్షితమైన వసతి, ఆరోగ్యకరమైన ఆహారం అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో వసతి గృహాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న కలెక్టర్, ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply