ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం…

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026పై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం…

ఎస్.ఐ.ఆర్-2026 ప్రక్రియపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి…
ఎస్.ఐ.ఆర్-2026 శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి.

ఏలూరుబ్యూరో, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision–2026 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులకు సమగ్ర అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఈఆర్ఓలు (Electoral Registration Officers ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్), ఏఈఆర్ఓలు (Assistant Electoral Registration Officers అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్), బీఎల్ఓలు (Booth Level Officers బూత్ లెవెల్ ఆఫీసర్స్) మరియు సూపర్వైజర్లను ఉద్దేశించి కలెక్టర్ ప్రసంగించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఓటరు జాబితాల స్వచ్ఛత, పారదర్శకత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కీలకమని తెలిపారు. ఏఈఆర్ఓలు, బిఎల్వీఓ లకు సమగ్రంగా శిక్షణ ఇచ్చి ,క్షేత్ర స్థాయిలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. ఓటర్ల వివరాల మ్యాపింగ్ ప్రక్రియలో అసాధారణతలు, డూప్లికేషన్లు లేదా ఇతర సాంకేతిక లోపాలు గుర్తిస్తే వెంటనే సరిచేసే చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతి దశను జాగ్రత్తగా పరిశీలిస్తూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు అర్హులైన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హుల పేర్ల తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాల్లో అధికారులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో బీఎల్ఓలు ఇంటింటి సర్వే నిర్వహించి, ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని, ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను నిర్దేశిత విధానంలో స్వీకరించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, ప్రతి అర్హుడిని ఓటరు జాబితాలో చేర్చే దిశగా కృషి చేయాలని ఆమె సూచించారు.

శిక్షణ కార్యక్రమంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026కు సంబంధించిన మార్గదర్శకాలు, విధివిధానాలు, క్షేత్రస్థాయి అమలు అంశాలపై అధికారులకు వివరంగా అవగాహన కల్పించారు. జిల్లాలో ఎస్ ఈ ఆర్-2026 కార్యక్రమాన్ని నిర్ధేశిత గదువుల్లో పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ డిఆర్ఓ డిప్యూటీ డిఇఓ దేవకీదేవి,ఆయా నియోజకవర్గ ఈ ఆర్ ఓ లు కె. ప్రసన్న లక్ష్మి, కె.భాస్కర్, ఎంవి.రమణ,జీవి సత్యవేణి,బి. వినూత్న ఎన్నికల విభాగ అధికారులు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు, సూపర్వైజర్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply