శిశువు మృతదేహం కేసు ఛేదించిన పోలీసులు

శిశువు మృతదేహం కేసు ఛేదించిన పోలీసులు

  • ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో వెలుగులోకి వచ్చిన విషాద ఘటన
  • నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు – డీఎస్పీ పల్లె శ్రీనివా

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలోని విద్యానగర్ కాలనీలో నవజాత శిశువు మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపగా, పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అచ్చంపేట పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, ఇతర ఆధారాలతో పాటు స్థానిక మైత్రీ ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా మృత శిశువు తల్లి 25 ఏళ్ల మహిళ అని గుర్తించారు. ఆమె ఈ నెల 1వ తేదీ రాత్రి మైత్రీ ఆస్పత్రిలో చేరగా, 2వ తేదీన నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భంలోని శిశువు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం తల్లి అంగీకారంతో మృత శిశువును బయటకు తీసి ఆమెకు అప్పగించినట్లు పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే వ్యక్తిగత కారణాల వల్ల మృత శిశువును తన స్వగ్రామానికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడటంతో, ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు ఆయాలకు సరైన ప్రదేశంలో జాగ్రత్తగా పూడ్చిపెట్టాలని మహిళ కోరినట్లు విచారణలో తేలింది. కానీ వారు ఆ బాధ్యతను నిర్లక్ష్యంగా నిర్వహించడంతో విద్యానగర్ కాలనీలో శిశువు మృతదేహాన్ని సరిగా పూడ్చిపెట్టలేదని పోలీసులు గుర్తించారు. దీంతో అక్కడ సంచరించిన కుక్కలు మట్టిని తవ్వి శిశువు మృతదేహాన్ని బయటకు తీసి, అనంతరం అది మరో ప్రాంతంలో కనిపించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో మృత శిశువు మృతదేహం నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహించిన వారందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అచ్చంపేట డీఎస్పీ పి. శ్రీనివాస్ ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply