చిట్టెం రామ్మోహన్ రెడ్డి గృహనిర్బంధం

చిట్టెం రామ్మోహన్ రెడ్డి గృహనిర్బంధం

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు చర్యలు
పలువురు బీఆర్‌ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రజా సమస్యలను అరెస్టులతో అడ్డుకోలేరు: మాజీ ఎమ్మెల్యే చిట్టెం

మక్తల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా మక్తల్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నాయకుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులను గురువారం పోలీసులు గృహనిర్బంధం చేశారు.

స్థానిక సీఐ రామ్‌లాల్, ఎస్సైలు వెంకటేశ్వర్లు, వై. భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నర్సింహా గౌడ్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, నాయకులు శివారెడ్డి, బండారి ఆనంద్, ఎడివెళ్లి బాలప్ప తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో గృహనిర్బంధం చేసినట్లు పోలీసులు తెలిపారు. పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ, గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనల సందర్భంలో ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ప్రజా సమస్యలను గృహనిర్బంధాలు, అరెస్టులతో అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రతిపక్షాలను అరెస్టు చేస్తే తప్ప సీఎం పర్యటించలేని పరిస్థితి రావడం బాధాకరమన్నారు.

గ్రావిటీ కెనాల్ ద్వారా కొడంగల్‌కు నీటిని తీసుకెళ్తే ఈ ప్రాంత ప్రజలకు లాభం చేకూరుతుందని, పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించడం వల్ల స్థానిక రైతులకు ప్రయోజనం ఉండదని చిట్టెం పేర్కొన్నారు. మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూరు తదితర ప్రాంతాల్లో కేవలం 17 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే అవకాశం ఉందని అన్నారు.

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా కొడంగల్‌కు నీటిని తరలిస్తే 66 వేలకుపైగా ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ కక్షతో సీఎం రేవంత్ రెడ్డి భూత్పూర్ రిజర్వాయర్ ద్వారా నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమంగా గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకులను అడ్డుకునే బదులు ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని చిట్టెం రామ్మోహన్ రెడ్డి హితవు పలికారు.

Leave a Reply