ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలు, తాగునీటి సమస్య, మరుగుదొడ్లు, ఫర్నిచర్, ఇతర విద్యా సౌకర్యాల లోపం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాజశేఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, ఇతర విద్యా సామగ్రి అందేలా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆయన ఆరోపించారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలని అన్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జంగపల్లి అరవింద్, నగర ఉపాధ్యక్షుడు విగ్నేష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply