4thJunechintana | రమణానంద మహర్షి చెప్పిన ఆత్మతత్త్వ మార్గం
4thJunechintana | రమణానంద మహర్షి చెప్పిన ఆత్మతత్త్వ మార్గం
4thJunechintana | రమణానంద మహర్షి చెప్పిన ఆత్మతత్త్వ మార్గం
యోగ వాశిష్ఠంలో శ్రీరామునికి వశిష్ఠ మహర్షి బోధ
పుణ్యుడు, పావనుడు కథలో దాగిన జీవన సత్యం
మోహబంధం నుంచి జ్ఞానోదయం వరకు ఆధ్యాత్మిక ప్రయాణం
సుఖదుఃఖాలను సమంగా చూడగలిగితేనే నిజమైన జ్ఞానం
4thJunechintana | శ్రీ రమణానంద మహర్షి వద్దకు ఎవరు వెళ్లినా, భక్తులతో ముందుగా “నీవు ఎవరివో తెలుసుకో” అనేవారు. ఒకసారి శ్రీరాముడికి కూడా ఇదే సందేహం వస్తే, ఆయన గురువు వశిష్ఠ మహర్షిని అడిగినప్పుడు, వశిష్ఠుడు శ్రీరామునికి బోధించి, జ్ఞానాన్ని కలుగజేసిన సంభాషణే “యోగ వాశిష్ఠము” అనే పేరుతో ఒక ఉత్కృష్టమైన గ్రంథంగా మనకు అందించబడింది. అందులోని ఐదవ భాగం నుంచి కొన్ని విషయాలు క్రోడీకరించడం జరిగింది. ఇక “మీరెవరు? నేనెవరు?” తెలుసుకుందాం.
మహేంద్ర పర్వతం మీద ఆకాశగంగ తీరంలో దీర్ఘతవుడు అనే మహర్షి ఆశ్రమం ఉంది. ఆయనకు ఇద్దరు కొడుకులు. వారే పుణ్యుడు, పావనుడు. వీళ్లిద్దరూ కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. అలా కొంతకాలానికి అన్నగారైన పుణ్యుడికి ఆత్మతత్త్వంతో జ్ఞానోదయం కలిగింది. తమ్ముడికి జ్ఞానం కలిగింది, కానీ అనుభవం తక్కువ. విధి వశాత్తు తల్లిదండ్రులు ఇద్దరూ అనుకోకుండా ఒకేసారి మరణించారు. తమ్ముడు చాలా దుఃఖంతో ఉన్నాడు. అంత్యక్రియలు పూర్తయిన తరువాత తమ్ముడు ఇంకా బాధపడుతుంటే, అన్నగారు జాలిపడి, “తమ్ముడూ! ఎందుకు ఇంకా రోదిస్తున్నావు? మన తల్లిదండ్రులు ఇద్దరూ ముక్తిని పొందారు. మోక్షం పొందిన వారి గురించి ఇంకా చింతించడం ఎందుకు? నువ్వు ‘ఈమె నా తల్లి, ఈయన నా తండ్రి’ అనే మోహబంధంతో ముడి వేసుకున్నావు. ఒక్క మాట అడుగుతాను… చెప్పు. ఈమె ఒక్కతే తల్లా నీకు? ఈయన ఒక్కడే తండ్రా? కాదే.
ఒకే చెట్టుకు ప్రతి సంవత్సరం ఋతుధర్మాన్ని అనుసరించి వందల కాయలు కాస్తున్నాయి. కొన్ని రాలిపోతాయి. మరికొన్ని రాలినవి మొలుస్తున్నాయి. కొన్నిటిని వాడుకుంటారు. ప్రతి ఋతువులోనూ వందల కాయలు కాస్తున్నట్లే, ప్రతి జన్మలోనూ నీకు తల్లి, తండ్రి వస్తున్నారు. పిందెల పక్కన ఆకులు ఉన్నట్లుగా బంధువులు చేరుతున్నారు. నీకు ఎన్నో జన్మలు అయ్యాయి. ఎంతోమంది తల్లిదండ్రులు అయ్యారు. వాళ్లందరూ గతించారు కదా! వాళ్ల కోసం ఎందుకు విలపించవు? వీళ్ల కోసమే ఎందుకు?
నాయనా! తమ్ముడూ! ఇదంతా ఒక భ్రమ. సత్యం అవ్వడానికి వీల్లేదు. ‘ఈ దేహమే నేను’ అనే భ్రాంతిలో ఉన్నావని అనుకోవడం లేదు. ‘నా తల్లిదండ్రులు, నా బంధువులు’ అంటున్నావు. ముందుగా “నేను” అనే భావన గురించి తెలుసుకుంటే, జ్ఞానం కలిగిన తర్వాత, నేను అనే భావన ఎగిరిపోతుంది. ముందుగా నీవు దుఃఖపు పొంగు ఆపుకో!” అని అన్నాడు.
తమ్ముడు బదులిస్తూ, “అన్నా! నువ్వు చెప్పేది అంతా వాస్తవం. కానీ లోపల ఉండే సూక్ష్మ శరీరం నేను కాదనడం బాగోదు కదా!” అన్నాడు. వెంటనే అన్న పుణ్యుడు కలుగజేసుకొని, “నువ్వు ఇంతకుముందు జన్మల్లో పక్షులుగా, జంతువులుగా, మానవులుగా పుట్టావు. అవన్నీ నీకు గుర్తు లేవు. ఒక్కో జన్మలో ఒక్కో సూక్ష్మ రూపంలో పుట్టావు. అందుచేత నీ దుఃఖానికి సరైన కారణం లేదు. ముందుగా నీవు ఉపశమనం పొందు” అని మరికొన్ని విషయాలు చెప్పగా, తమ్ముడికి జ్ఞానోదయం అయింది. దుఃఖరహితుడయ్యాడు.
హాలులో ఉన్న స్విచ్ వేస్తే, గదిలో లైట్ వెలుగుతుంది. మరి ఆ కరెంట్ కనబడటం లేదు కదా. అలాగే ప్రాణం అంటున్నాము. ఆ ప్రాణం కానీ, మనసు కానీ ఇవేవీ కంటికి గోచరించవు. కానీ మనం జీవిస్తున్నామంటే, శక్తి నడిపిస్తోంది. అదే ప్రాణశక్తి.
మనకు మూడు అవస్థలు ఉన్నాయి. అవే జాగ్రతావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. సుషుప్తి అవస్థలో ఉంటే, మనం మన ఉనికిని కోల్పోతాం. ఎవరు లేపినా, పలకరించినా చలనం ఉండదు. మరి ఆ సమయంలో ఆత్మ, మనసు, ఇంద్రియాలు ఏమయ్యాయి? బుద్ధి అజ్ఞానంలో ఉంటుంది. మిగిలిన రెండు అవస్థలలో స్పృహలోనే ఉంటాం. సుషుప్తి అవస్థలో ఉన్నట్లుగా మనం మన దేహవాసనలను వదిలిపెట్టినట్లుగా ఉంటే, “నేను” అనే భావనకు అర్థం తెలుస్తుంది. ఆ స్థితిలో నాది, నేను అనే భావన ఉండదు కదా.
ఎన్ని గ్రంథాలు తిరగేసినా, ఎంతోమంది సూచనలు పాటించినా, “నేను” అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. మనం కల్పించుకుని కొట్టుమిట్టాడుతున్నాము. కాబట్టి ముందుగా దేహ భావనలు వదిలిపెట్టండి. సుఖాన్ని, దుఃఖాన్ని సమస్థాయిలో చూడగలిగితే, నువ్వు ఎవరు? నేనెవరు? అనే భ్రమలో నుంచి బయటపడతాము. జ్ఞానోదయం పొందుతాము.
– అనంతాత్మకుల రంగారావు
