Surya’s T20I Captaincy | సూర్యకుమార్ చేజారిన‌ టీ20 పగ్గాలు

Surya’s T20I Captaincy | సూర్యకుమార్ చేజారిన‌ టీ20 పగ్గాలు

ఆంధ్రప్రభ : భారత జట్టుకు చారిత్రాత్మక టీ20 ప్రపంచకప్ అందించిన మూడు నెలలకే స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై వేటు పడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించినట్లు జాతీయ మీడియాలో కథనాలు చెక్క‌ర్లు కొడుతున్నాయి..

ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో సూర్య నాయకత్వంలో భారత జట్టు టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకుంది. టీ20 ప్రపంచకప్‌ను వరుసగా నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అయితే జట్టు భవిష్యత్ ప్రణాళికలు, కొత్త టీ20 సైకిల్‌ను దృష్టిలో ఉంచుకుని నాయకత్వ మార్పు అవసరమని సెలక్షన్ కమిటీ భావించినట్లు సమాచారం.

మీడియా కథనాల ప్రకారం, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో సంప్రదింపులు జరిపిన అనంతరం సెలక్షన్ కమిటీ, బీసీసీఐ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు ప్రపంచకప్ గెలిచినా, ఇటీవల సూర్య‌ ఫామ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

గత రెండేళ్లుగా నిలకడలేని ప్రదర్శనలతో ఇబ్బంది పడుతున్న సూర్య.. 2026 ఐపీఎల్‌లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులు మాత్రమే చేసి 20.76 సగటుతో నిరాశపరిచాడు. రాజస్థాన్ రాయల్స్‌పై అర్ధశతకం మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు లేకపోవడం అతడిపై ఒత్తిడిని పెంచింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. మార్చిలో భారత్‌కు మూడో టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ అయినప్పటికీ, బ్యాటింగ్ వైఫల్యాలు మాత్రం అతడిని వెంటాడుతూనే ఉన్నాయి.

అయితే, కెప్టెన్సీ మాత్రమే కాకుండా టీ20 జట్టులో సూర్యకుమార్ స్థానం కూడా ప్రశ్నార్థకంగా మారినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ అంశంపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే కొత్త టీ20 కెప్టెన్ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. వరల్డ్‌కప్ గెలిపించిన కెప్టెన్‌కే పదవి కోల్పోయే పరిస్థితి రావడం ప్రస్తుతం భారత క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

సెల‌క్ట‌ర్ల దృష్టిలో ఆ నలుగురు

సూర్యకుమార్ యాదవ్ స్థానంలో టీ20 జట్టు పగ్గాలు ఎవరికి అప్పగించాలనే దానిపై సెలక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం కెప్టెన్సీ రేసులో ఐపీఎల్‌లో సారథ్య అనుభవం ఉన్న శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ మరియు ఇషాన్ కిషన్న లుగురు ఆటగాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి ఈ న‌లుగురిలో టీ20 కెప్టెన్సీ ప‌గ్గాలు ఎవ‌రు చేప‌డ‌తారో వేచి చూడాలి.

Leave a Reply