కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి..
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు క్షీణించాయి..
- మాజీ హోంమంత్రి మహమూద్ అలీ
మహబూబ్‌నగర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడారని, రాష్ట్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేసి నేరాలను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు ప్రజలకు భద్రత కల్పించామని తెలిపారు.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని, నేరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్‌కు సమాంతరంగా మహబూబ్‌నగర్ అభివృద్ధికి విశేష కృషి చేశారని మహమూద్ అలీ కొనియాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. అలాగే ఎస్ఐఆర్, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ప్రజా హామీల అమలుకు ఒత్తిడి తీసుకురావాలి: శ్రీనివాస్ గౌడ్
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రజల తరఫున ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాకు ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో వెయ్యి పడకల ఆసుపత్రి, టూరిజం హోటల్‌ను పరిశీలించామని, అది రాజకీయాల కోసం కాదని, జిల్లా అభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరమే కీలకమని, ప్రభుత్వం నుంచి తగిన నిధులు కేటాయించేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు.
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించడంతో పాటు, బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
