కాళ్లు విరిచేశాడు..!

కాళ్లు విరిచేశాడు..!

అత్తపై అల్లుడి దారుణం.. ఆటోలో తీసుకెళ్లి రాడ్‌తో దాడి

వినుకొండ, ఆంధ్రప్రభ: పట్టణ శివారు ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్తున్న అత్తను అల్లుడు ఆటోలో ఎక్కించుకుని పట్టణ శివారులోని ఓ వెంచర్‌లోకి తీసుకెళ్లి రాడ్‌తో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరుకు చెందిన హుస్సేన్ పీరా కుటుంబ తగాదాల కారణంగా అతని భార్య పుట్టింటికి వెళ్లింది. భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తపై హుస్సేన్ పీరా కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది.

భార్య కాపురానికి రాకపోవడంతో హుస్సేన్ పీరా కల్లూరు నుంచి వినుకొండకు వచ్చి ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం అతని అత్త ఆసుపత్రికి వెళ్తూ వినుకొండలో కనిపించడంతో, ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. అనంతరం పట్టణ శివారు ప్రాంతంలోని ఓ వెంచర్‌లోకి తీసుకెళ్లి రాడ్‌తో ఆమెపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో ఆమె కాళ్లు విరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

దాడి అనంతరం బాధితురాలిని ఆటోలోనే కురిచేడు మండలం కల్లూరుకు తీసుకెళ్లి, అక్కడ ఇంట్లో వదిలేసినట్లు సమాచారం. స్థానికులు గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply