దేవిపట్నంలో పెద్దపులి పంజా

దేవిపట్నంలో పెద్దపులి పంజా

14 గోవు దూడలు మృతి.. పులిని బంధించేందుకు అటవీశాఖ ప్రత్యేక బృందాల ఆపరేషన్

దేవిపట్నం, ఆంధ్రప్రభ: పోలవరం జిల్లా దేవిపట్నం మండలంలో పెద్దపులి పంజా విసిరింది. పాత గంగంపాలెం గ్రామ శివారు ప్రాంతంలో 14 గోవు దూడలపై దాడి చేసి చంపడంతో మండల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. దేవిపట్నం మండలంలోని పోలవరం ప్రాజెక్ట్ ముంపు ప్రాంత పరిధిలో ఉన్న పాత గంగంపాలెం గ్రామ శివారులో మంగళవారం అర్ధరాత్రి తర్వాత పెద్దపులి దాడి చేసింది. ఈ ఘటనలో 14 గోవు దూడలు మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

గత మూడు నెలలుగా పోలవరం జిల్లాలోని రంపచోడవరం, దేవిపట్నం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో ఈ పెద్దపులి సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గత వారం రోజుల క్రితం రాజవొమ్మంగి మండలంలో 7 మూగజీవులపై దాడి చేయగా, అవి మృతి చెందాయి. రాజవొమ్మంగి మండలం నుంచి అడ్డతీగల మీదుగా గంగవరం పరిసర అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సుమారు మూడు రోజుల పాటు సంచరించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. గంగవరం నుంచి రంపచోడవరం మండలం ఫోక్స్‌పేట ఏ1 రిసార్ట్ సమీపంలో ఒక పశువును వేటాడింది. అక్కడి నుంచి మళ్లీ గంగవరం మండలంలో ప్రవేశించి, అనంతరం దేవిపట్నం మండలంలోకి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

పులి వరుస దాడులతో దేవిపట్నం మండలంలోని గిరిజన గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు తమ పశువులను బయటకు వదిలేందుకు భయపడుతున్నారు. రాత్రి వేళల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికే గ్రామస్తులు వెనుకాడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పులి వేగంగా సంచరిస్తుండటంతో మనుషులపై కూడా దాడి చేసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి కదలికలు గుర్తించినప్పటికీ దానిని బంధించడంలో ఆలస్యం జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

పెద్దపులి దాడి ఘటనతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి ముఖ్య వన్యప్రాణి సంరక్షకులు ఎన్. నాగేశ్వరరావు, రాజమండ్రి ముఖ్య అటవీ సంరక్షకురాలు డాక్టర్ జ్యోతి, రంపచోడవరం డీఎఫ్‌ఓ ఎన్. రామచంద్రరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.రాజమండ్రి ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ టి. శ్రీనివాసరావు, రంపచోడవరం సబ్ డీఎఫ్‌ఓ టి. అనూష, అడ్డతీగల సబ్ డీఎఫ్‌ఓ జె.వి. సుబ్బారెడ్డి, ఇందుకూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొండలరావు, ఫోక్స్‌పేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు కూడా చర్యల్లో పాల్గొన్నారు.

Leave a Reply