10-Heaven : కృష్ణాలో మరో కేరళం .. Andhra Orabha Top Story
10-Heaven : కృష్ణాలో మరో కేరళం .. Andhra Orabha Top Story
- విజయవాడలో అద్బుతం
- కృష్ణమ్మ ఒడిలో విహారం..వినోదం..విలాసం…!
- కృష్ణవేణి అలలపై ఆనంద పరవశం
- అబ్బురపరిచే హౌస్ బోట్ ప్రయాణం…
- భవానీ ద్వీపం ఓ బంగారు లోకం
- ఫ్లోటింగ్ బోట్లపై లాహిరి..లాహిరి..లాహిరిలో..
- 24 గంటలు హౌస్ బోట్ అవకాశం..
- రాష్ట్రంలో 10 ప్రాంతాల్లో హౌసింగ్ బోట్ల ఏర్పాటు..
- నిర్వహణకు ప్రభుత్వం చర్యలు.
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ)

లాహిరి..లాహిరి..లాహిరిలో… ఓహో జగమే ఊగెనుగా..ఊగెనుగా..తూగెనుగా….అంటాడో సినీకవి. అలల ఊపులో తియ్యని తలపులతో పడవ ప్రయాణం ఓ మధురానుభూతిని పంచుతోంది. శరత్కాలపు పున్నమిచంద్రుడి చల్లని వెన్నెలలో కృష్ణవేణి వాయువుల లాలనలో ఆహా ఆ ప్రయాణం మధుర జ్ఞాపకంగా మిగులుతోంది. విజయవాడ కృష్ణానదిలో నూతనంగా ప్రవేశపెట్టిన ఫ్లోటింగ్ బోట్ ప్రయోగం పర్యాటకానికి సరికొత్త సొబగులను అద్దుతోంది.
10-Heaven : మరో కేరళం

హౌస్ బోట్ అనగానే గుర్తుకువచ్చేది కేరళ. ఇక పర్యాటకులు ప్రవహించే కృష్ణవేణి అలలపై కదిలే హౌసింగ్ బోట్లను విజయవాడకు పరిచయం చేసేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన పర్యాటక పాలసీతో టూరిజం హబ్‌గా మార్చే దిశగా అనేక ప్రాజెక్టును ప్రవేశపెట్టింది. ఓ వైపు అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో దేశ, విదేశీ టూరిస్టులను ఆకట్టుకునే రీతిలో అనేక వినూత్న కార్యక్రమాలతో పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ టూరిస్టులకు కేరళ తరహా ప్రకృతి రమణీయతల మధ్య నదీ విహారాన్ని కల్పించే ఉద్దేశంతో ఫ్లోటింగ్ బోట్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా
హౌస్ బోట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. 24 గంటల సేపు నదిలో విహరించడంతో పాటు ఎంచక్కా విలాసవంతమైన సౌకర్యాలతో విడిది చేసేలా పర్యాటక శాఖ పీపీపీ పద్ధతిలో ఈ బోట్లను సిద్ధం చేసింది.
10-Heaven : భవానీ ద్వీపం బంగారు లోకం

కృష్ణనది మధ్యలో పచ్చని ప్రకృతితో అలరారే భవానీ ద్వీపం ప్రకృతి ప్రేమికులకు వరంగా మారింది. కూటమి ప్రభుత్వం ఈ ఐలాండ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఫ్లోటింగ్ బోట్లు ఏర్పాటుచేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పీపీపీ పద్ధతిలో ఒప్పందం కుదుర్చుకుంది. సింపుల్ ఇండియా సంస్థకు ఈ బోట్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కేరళ తరహాలో ఇక్కడ కూడా హౌస్ బోట్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ బోట్లలో విడిది చేసేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. భవానీ ద్వీపానికి ప్రతి ఏటా 5 లక్షల నుంచి 6 లక్షల మంది పర్యాటకులు సందర్శించడం విశేషం. అయితే ఈ సంఖ్య రెట్టింపు చేసే లక్ష్యంగా రాష్ట్ర పర్యాటక సంస్థ చర్యలు తీసుకుంటుంది.
..10-Heaven : విజయవాడ …ఇక విశ్వ వ్యాప్తం..

విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు నిత్యం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. అయితే అమ్మవారి దర్శనం పూర్తిచేసుకున్న తర్వాత పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకున్నా సరైన సౌకర్యాలు లేకపోవడంతో వెనుదిరగాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భవానీ ద్వీపం అందాలను వీక్షించేందుకు పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన హౌస్ బోట్లు పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కనదుర్గమ్మ దర్శనం అనంతరం ఉండవల్లి, కొండపల్లి గుహలను సందర్శించి సమీపంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించాలని భావించే టూరిస్టులకు ఈ హౌస్ బోట్లు వరంగా మారాయి.
..10-Heaven : 24 గంటలకు అవకాశం..

పబ్లిక్ ప్రైవేట్ మోడల్ లో ప్రభుత్వంతో కలిసి సింపుల్ ఇండియా సంస్థ ప్రవేశపెట్టిన ఈ హౌసింగ్ బోట్లలో 24 గంటల సేపు ఉండేందుకు అవకాశం ఇస్తారు. ఉదాహరణకు మధ్యాహ్నం 2 గంటలకు పున్నమిఘాట్‌కు వచ్చే పర్యాటకులు తర్వాత రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఇందులో ఉండే అవకాశం కల్పిస్తున్నారు. సింగిల్ బెడ్రూమ్ కూడా అందుబాటులో ఉంచారు. అన్ని రకాల సదుపాయాలను అందుబాటులో ఉంచారు. ఈ బోట్లకు సంబంధించిన వివరాలు, బుకింగ్స్ కూడా ఆన్లైన్లో చేసుకొనే అవకాశం కల్పించారు. శని, ఆదివారాల్లో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరికి సాయంత్రం స్నాక్స్, ఉదయం టిఫిన్ కూడా అందజేస్తున్నారు. రాత్రిపూట చల్లని పున్నమి వెన్నెల వెలుగుల్లో నది అలలపై విహరిస్తూ భోజనం కూడా చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇవన్నీ ప్యాకేజీలో భాగంగానే పర్యాటకులకు సమకూర్చుతున్నారు. ఈ బోటులో విహరించే పర్యాటకులకు సాయంత్రం ఒకసారి ఆ ప్రకాశం బ్యారేజ్ చుట్టూ దాదాపు మూడు నాలుగు కిలోమీటర్లు పడవలో తిప్పుతారు.
10-Heaven : అమరావతి అడుగుల్లో మరింత ప్రగతి..

కాగా అమరావతి నిర్మాణ పనులు పూర్తయితే పర్యాటక రంగానికి మరింత శోభ వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర రాజధానికి వచ్చే దేశ,విదేశీ ప్రతినిధులు కృష్ణవేణి నది అందాలను ఈ బోట్లలో వీక్షించే అవకాశం ఉంటుది పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పీపీపీ పద్ధతిలో అనేక నూతన ప్రాజెక్టులను తీసుకువచ్చి పర్యాటకంగా వృద్ధి చెందేందుకు కృషి చేసింది. మరోవైపు ఈ యొక్క భవాని ఐలాండ్ బ్యారేజ్ ని దుర్గమ్మ కనకదుర్గమ్మని కూడా కలుపుతూ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కూడా పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
