ధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలి: ఎర్రబెల్లి దయాకర్ రావు

పాలకుర్తి, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పాలకుర్తి మండల కేంద్రంలో ఉన్న చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డును బుధవారం ఆయన సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వారం రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కంటలు వేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అకాల వర్షాలతో పండించిన ధాన్యం తడిసి నష్టపోతున్నామని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు మార్కెట్ యార్డును పరిశీలించి రైతులతో మాట్లాడారు.

రైతులు సంచుల కొరత, లారీల లభ్యత లేకపోవడం వల్ల ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని వివరించడంతో ఆయన జనగామ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు, రైతుబంధు సకాలంలో అందించడంలో విఫలమైందని విమర్శించారు. పండిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఎన్నికల సమయంలో ప్రతి పంటకు బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయలేదని, గత యాసంగి బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply