సీఎం సహాయనిధి పేదలకు అండ
సీఎం సహాయనిధి పేదలకు అండ
ఇద్దరు లబ్ధిదారులకు ఎల్‌ఓసీలు అందజేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
విజయవాడ, ఆంధ్రప్రభ: ఆపత్కాలంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన లెటర్స్ ఆఫ్ క్రెడిట్ ఎల్‌ఓసీలను అందజేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో ఉన్న ఇద్దరు లబ్ధిదారులకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా ఎల్‌ఓసీ పత్రాలను అందించారు.
గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామానికి చెందిన జంపాన లక్ష్మికి వైద్య చికిత్స నిమిత్తం రూ.67,879 విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది. నున్న గ్రామానికి చెందిన మేదండి నవ్యశ్రీకి చికిత్స కోసం రూ.2,04,396 విలువైన ఎల్‌ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా కార్పొరేట్ వైద్యానికి దూరం కాకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా నిలుస్తోందన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు అవసరమైన వివరాలతో తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అత్యంత క్లిష్ట సమయంలో ఆర్థికంగా అండగా నిలిచి, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎల్‌ఓసీలు మంజూరయ్యేలా చొరవ చూపిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
