NTR Indira Revanthism | ఎన్టీఆర్ – ఇందిరమ్మ స్ఫూర్తి వ్యాఖ్యలపై విశ్లేషణ

NTR Indira Revanthism | ఎన్టీఆర్ – ఇందిరమ్మ స్ఫూర్తి వ్యాఖ్యలపై విశ్లేషణ

NTR Indira Revanthism | ఎన్టీఆర్ విగ్రహావిష్కరణతో కొత్త రాజకీయ చర్చ
కాంగ్రెస్ వేదికపై ఎన్టీఆర్‌కు ఘన నివాళి
సంక్షేమ రాజకీయాల మూలాలపై రేవంత్ వ్యాఖ్యానం
తెలుగుదేశం, కాంగ్రెస్ మధ్య కొత్త సమీకరణాలా?
ఎన్టీఆర్ విగ్రహంతో భారాసకు రాజకీయ చెక్?

NTR Indira Revanthism | రాజకీయంలో రెండు రెండ్లు నాలుగు కావాలని లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కాలమానాలు, సమయాసందర్భాలను బట్టి రాజకీయ నాయకుల భావనలు ఉంటాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పార్టీని పెట్టి, కాంగ్రెస్ ముక్త భారత్ కోసం శ్రమించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్, అలియాస్ ఎన్టీవోడు విగ్రహాన్ని ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని ఊహించగలమా!

అదీ తెలంగాణ రాజధాని నడిబొడ్డున అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీవోడి 103వ జయంతి సందర్భంగా ఆయన ఠీవి విగ్రహాన్ని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం అభిమానులతోపాటు కాంగ్రెస్ కార్యకర్తల కోలాహలం మధ్య నేత్రోత్సవంగా ఆవిష్కరించిన దృశ్యం కాలం అవనికపై శాశ్వతంగా ముద్రితమవుతుంది. తెలంగాణ వచ్చిన తరువాత రాజధానిలో నందమూరి విగ్రహం ఆవిష్కరించడం ఇదే మొదటిది కావడం మరో విశేషం.

ఈ రాజకీయ అద్వైతాన్ని సాధించింది రేవంత్ రెడ్డి. నిరుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఈ ఆవిష్కరణకు పునాది పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పుతానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే మోతీనగర్‌లో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం నెలకొల్పుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హామీ ఇచ్చారు. తమ హయాంలో ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెద్ద స్థాయిలో నెలకొల్పిన వైనాన్ని కూడా గుర్తు చేయడం విశేషం.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలంగాణ గడ్డపై స్థాపించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. కాంగ్రెస్ నాయకులను దునుమాడి, వారిని కుక్కమూతిపిందెలుగా, ఆషాఢభూతులుగా అభివర్ణించి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేక సమ్మేళనాలు నిర్వహించి, నేషనల్ ఫ్రంట్‌ను నెలకొల్పిన ధీశాలి ఎన్టీ రామారావు.

అటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి కలిసి నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆవిష్కరించడం రాజకీయాల్లో చెప్పుకోదగిన వింతే. ఈ సందర్భంగా రేవంత్ తమ ప్రభుత్వం అన్న ఎన్టీఆర్, ఇందిరమ్మల స్ఫూర్తితో ప్రజా సంక్షేమానికి పాటుపడుతోందని చెప్పడం రాజకీయ ఇంద్రజాలం కాక మరేమిటి?

సంక్షేమం అమలు అంటేనే ఎన్టీఆర్ నుంచే గణించాలి. అంతకుముందు తరహా అంతా… ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే మళ్లీ గుడిసెలు వేసుకోవడానికి 40 తాటాకులు, 4 బొంగులు, కొంత ఆర్థిక సహాయం చేసేవారు. ఎన్టీఆర్ వచ్చాక పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ఆరంభించారు.

తెలుగునాట సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి అన్న సంగతలా ఉంచితే… ఎన్టీఆర్‌కు కీలక ప్రత్యర్థి అయిన ఇందిరాగాంధీని కూడా జోడించి తమ ప్రభుత్వ సంక్షేమ విధానాలకు జోడెద్దులు అన్న-అమ్మ అన్నట్టుగా సీఎం రేవంత్ చేసిన ప్రసంగం మాటల మరాఠీయం కాకపోతే మరేమిటి?

ఇందిరను తమ నాయకునితో పోల్చినా, ఎన్టీఆర్‌ను తమ సొత్తుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటే తెలుగుదేశం కార్యకర్తలు సహించడం ఉండదు. అలాంటిది విగ్రహావిష్కరణ సందర్భంగా శైవమైనా, వైష్ణవమైనా అంతా ఒకటే అన్నట్టుగా, అన్నైనా… అమ్మైనా అంతా సంక్షేమమేనన్న సీఎం రేవంతోపాఖ్యానం సభికులను అలరించింది.

ఇందిరమ్మ సంక్షేమ రాజ్యం పేరిట తాము అమలు చేస్తున్న పథకాలకు మూలం నందమూరేనని ఆయన చెప్పారు. సన్నబియ్యం రేషన్‌కు.. కిలో రూ.2 బియ్యం పథకం, ఇందిరమ్మ ఇళ్లకు.. పక్కా ఇళ్లు, చీరల పంపిణీకి.. జనతా వస్త్రాలు, రైతుకు ఉచిత విద్యుత్‌కు.. రూ.50కి హార్స్‌పవర్..లను ఉదహరిస్తూ రేవంత్ ద్వైతాన్ని అద్వైతం చేయడం రాజకీయ సమ్మోహనమే.

కాంగ్రెస్‌లో కొంతమంది పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు ఈ విగ్రహావిష్కరణను ఆక్షేపించినా.. వెరవక తాననుకున్నది చేయడం రేవంతిజం కదా.

తమ నాయకుడిని ప్రత్యర్థి పార్టీల ఖాతాలో వేయడానికి ఏ పార్టీ కేడర్ అంగీకరించదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2019-2024 మధ్య నందమూరి తారక రామునితోపాటు ఆయన మనుమడు జూనియర్ ఎన్టీఆర్ అలియాస్ తారక్‌ను వైసీపీ నాయకులు తమ ఫ్లెక్సీలపైకి పలుమార్లు ఎక్కించారు. ప్రతి సందర్భంలోనూ ఆయా ఫ్లెక్సీల తీరుపై తెలుగుదేశం నాయకులు, శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

అయితే తెలంగాణలో ఇందుకు భిన్నంగా జరిగింది. తమ నాయకుడు నందమూరిని కాంగ్రెస్ సీఎం సొంతం చేసుకోవాలని ప్రయత్నించినా.. తెలుగుదేశం కేడర్ పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. బహుశా… సీఎం రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లేటప్పుడు మారుతున్న సమీకరణాలు, పరిస్థితుల కారణంగా తాను బయటకు వచ్చానంటూ, ఇన్నాళ్లూ ఆదరించిన శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పడం తెదేపా కేడర్‌కు నచ్చడమే కారణం కావచ్చు.

రాజకీయాల్లో తమ ఆధిక్యతను చాటుకోవడానికి విగ్రహాలను ప్రతీకలుగా తీసుకోవడం తరచుగా జరుగుతున్నదే. తెలంగాణ ఉద్యమ సమయంలో, తరువాత ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల తొలగింపు లేదా కూల్చివేత గురించి కొంతమంది మాట్లాడేవారు. ఇటీవల కాలంలో తెలంగాణ తల్లి విగ్రహం నమూనా మార్పు, సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు సమయంలో కాంగ్రెస్, భారాస మధ్య మాటల మంటలు చెలరేగిన వైనం తెలిసిందే.

ఆయా సందర్భాల్లో సీఎం రేవంతే పైచేయిగా నిలిచింది. త్వరలో రాజధానిలో మూడు కార్పొరేషన్లకు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో భారాసపై పైచేయి సాధించేందుకు ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణతో సీఎం రేవంత్ చెక్ చెప్పారనే భావించాలి.

– కె. శివరామకృష్ణ

Leave a Reply