Choutuppal | చౌటుప్పల్ మున్సిపాలిటీకి నిధుల వరద !

Choutuppal | చౌటుప్పల్ మున్సిపాలిటీకి నిధుల వరద !

  • ​అభివృద్ధి పనులకు కౌన్సిల్ అత్యవసర ఆమోదం
  • రెండు స్మశాన వాటికల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
  • అధికారులతో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ సమీక్ష

​చౌటుప్పల్, (ఆంధ్రప్రభ) : చౌటుప్పల్ పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా మున్సిపల్ కౌన్సిల్ అడుగులు వేస్తోంది. శనివారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించారు.

పట్టణ ప్రగతి, ప్రజల అత్యవసర అవసరాలే ఎజెండాగా సాగిన ఈ సమావేశంలో మొత్తం రూ.3 కోట్ల 27 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు కౌన్సిల్ సుదీర్ఘంగా చర్చించి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది.

​ఎమ్మెల్యే ఆదేశాలతో స్మశాన వాటికల అభివృద్ధి ​స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో ప్రధానంగా ఉన్న రెండు స్మశాన వాటికలను అన్ని వసతులతో ఆధునీకరించేందుకు కౌన్సిల్ తీర్మానం చేసింది.

దీంతో పాటు పట్టణంలోని వివిధ వార్డులలో ప్రజలు ఎదుర్కొంటున్న అత్యవసర సమస్యల పరిష్కారానికి భారీగా నిధులను మంజూరు చేశారు. ఈ నిధులతో విరివిగా సీసీ రోడ్ల నిర్మాణం, మురుగు కాలువల (డ్రైనేజీ) వ్యవస్థ ఆధునీకరణ, పట్టణాన్ని వెలుగులతో నింపేందుకు నూతన వీధి దీపాల ఏర్పాటు లాంటి మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు.

‘​అధికారులతో ముఖాముఖి.. సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం’

​సమావేశంలో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగా అధికారులతో చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వార్డుల కౌన్సిలర్లు తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిపై ముఖాముఖి చర్చ సాగింది.

విద్యుత్ శాఖ ఏఈ సతీష్‌తో వీధి దీపాలు, వంగిన స్తంభాల మార్పిడిపై.. మిషన్ భగీరథ ఏఈ శ్వేత, అమృత్ 2.0 ఏఈ వినయ్ కుమార్‌లతో తాగునీటి లీకేజీల నివారణ, ట్యాంకుల నిర్వహణపై సమీక్షించారు. ఆర్ అండ్ బి ఏఈ నవీన్‌తో కలిసి పట్టణం లోని ప్రధాన రహదారులు, ముఖ్యంగా వలిగొండ రోడ్డు మరమ్మతులపై చర్చించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

‘​పట్టణానికి 4 బస్తీ దవాఖానాలు మంజూరు’

​ఆరోగ్య శాఖ నుండి డాక్టర్ కాటమరాజు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు నాలుగు (4) బస్తీ దవాఖానాలు మంజూరైనట్లు ప్రకటించారు. విద్యాశాఖ ఎంఈఓ గురువారావు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శోభారాణి, ఎఫ్‌ఆర్‌ఓలతో కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, ప్రజారోగ్యంపై చర్చించి సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే మార్గాలను సుగమం చేశారు.

​ఈ ఉన్నత స్థాయి సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ నితీష్ రెడ్డి, మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్‌ఓ అంజయ్య, సీనియర్ అసిస్టెంట్లు రఘుపతి, దీప, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply