AP Exclusive | అభివృద్ధి పథంలో పల్నాడు

AP Exclusive | అభివృద్ధి పథంలో పల్నాడు

AP Exclusive | కూటమి సర్కార్ ప్రత్యేక శ్రద్ధ
వేల కోట్లతో రహదారుల విస్తరణ
పర్యాటకానికి, వెనుకబడిన ప్రాంతాలకు ప్రగతి వారధి
ఏపీ-తెలంగాణ వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసే కనెక్టివిటీ

AP Exclusive | ప‌ల్నాడుబ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : రోడ్లు అభివృద్ధికి ముఖ‌ద్వారం వంటివి. రోడ్లు అభివృద్ది చెంది రాజ‌ధాని అమ‌రావ‌తికి అనుసంధానం అవ్వ‌డం ద్వారా ప‌ల్నాడు జిల్లా స‌ర్వ‌తోముఖాభివృద్ధి సుసాధ్య‌మౌతుంది. ఈ దిశ‌గానే ప్ర‌భుత్వం రోడ్ల అభివృద్ధికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే కేంద్రాన్ని ఒప్పించి పేరేచర్ల-కొండమోడు 4 లేన్ల రహదారి, వినుకొండ-గుంటూరు 4 లేన్ల రహదారితోపాటు మాచర్ల నియోజకవర్గంలో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చేయడంలో విజయం సాధించింది.

పల్నాడు జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధి…

పల్నాడు జిల్లాలో జాతీయ రహదారుల విస్తరణ వేగంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న కీలక రహదారి ప్రాజెక్టులు జిల్లాకు కొత్త రూపును తీసుకువస్తున్నాయి. ఈ హైవేలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా, పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాలకు మరింత ఊతం లభించనుంది. పల్నాడు ప్రాంతానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ నాణ్యమైన ఖనిజ సంపదతో పాటు పక్కనే నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం పల్నాడు జిల్లా అట్టడుగున ఉంది. యువత ఉపాధి లేక నిరుద్యోగంతో, ప్రజలు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు, నీరు అందుబాటులో ఉన్నా రవాణా సదుపాయం అవరోధంగా మారింది. కూటమి ప్రభుత్వం పల్నాడు జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే మౌలిక వసతుల్లో కీలకమైన రహదారుల నిర్మాణంపై దృష్టి సారించింది.


కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారి

పల్నాడు జిల్లాలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రోడ్డు విస్తరణ పనులు జోరుగా సాగుతున్నాయి. 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఇప్పటికే 11.57శాతం పని పూర్తయింది. ఈ నేషనల్ హైవే ప్రాజెక్టుతో ప్రయాణ సమయం, ఖర్చు తగ్గి, ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుంది. 49.9 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిగా ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. రూ.1032.52 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ హైవే పనులు వేగంగా సాగుతుండగా, వచ్చే ఏడాదిలో పూర్తయ్యే అవకాశముంది. ఈ మార్గం పూర్తైతే గుంటూరు – పల్నాడు మధ్య రవాణా మరింత సులభం కానుంది. కొండమోడు రహదారి విస్తరణ పనులు పూర్తయితే హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు ఊరట దక్కినట్లే. గుంటూరు, అమరావతి నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు సుమారు 40 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవడమే కాకుండా.. ఇంధన ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ రహదారి విస్తరణ పల్నాడు ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలకు, పేరేచర్ల దగ్గర ఉన్న క్వారీల నుంచి వచ్చే కంకర ఉత్పత్తుల రవాణాకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇటు గుంటూరు, పల్నాడు ప్రాంతాల నుంచి పత్తి, మిర్చి వంటి వాణిజ్య పంటల రవాణా సులభతరం అవుతుంది. ఈ మార్పులన్నీ ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని భావిస్తున్నారు.

దాచేపల్లి – మాచర్ల జాతీయ రహదారి…

జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా పట్టణాల్లో ట్రాఫిక్‌ రద్దీ నియంత్రణకు బైపాస్‌లు నిర్మిస్తున్నారు. దాచేపల్లి-మాచర్ల జాతీయ రహదారి 167ఏడీ మార్గంలో గురజాల, రెంటచింతల, మాచర్ల పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న రహదారులు అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా మూడు పట్టణాల్లో రహదారులు, డ్రెయిన్ల అభివృద్ధికి జాతీయ రహదారుల సంస్థ రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది నెలల వ్యవధిలో అభివృద్ధి పనులు పూర్తిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దాచేపల్లి-మాచర్ల మార్గంలో గురజాల, రెంటచింతల, మాచర్ల ఉన్నాయి. వీటి గుండా ప్రస్తుతం ఉన్న మార్గం వెళుతుండగా ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా మూడింటికి బైపాస్‌లు నిర్మించారు. అయితే పట్టణాల్లో రోడ్లు విస్తరించడంతోపాటు మార్గానికి రెండువైపులా డ్రెయిన్లు నిర్మించి భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చూడటానికి రూ.50 కోట్లు వెచ్చిస్తున్నారు.

నాగార్జునసాగర్ – దావుపల్లి జాతీయ రహదారి

47 కిలోమీటర్ల మేర రెండు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చింది. రూ.403.86 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు సాగర్ ప్రాంత రవాణాకు కీలకంగా మారింది. దీనికి కొనసాగింపుగా దావుపల్లి – మల్లవరం వరకు చేపట్టిన రహదారి పనులు రూ.393.61 కోట్లతో కొనసాగుతున్నాయి. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తవడంతో త్వరలోనే ఈ మార్గం కూడా అందుబాటులోకి రానుంది. పల్నాడు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతం గుండా దీన్ని నిర్మించడంతో మాచర్ల నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడనుంది.

ఓడరేవు – చిలకలూరిపేట – నకరికల్లు కారిడార్
ఓడరేవు నుంచి చిలకలూరిపేట వరకు హైవే ఇప్పటికే పూర్తై ప్రజలకు అందుబాటులో ఉంది. రెండో దశలో చిలకలూరిపేట నుంచి నకరికల్లు వరకు, నరసరావుపేట మీదుగా జాతీయ రహదారి నిర్మాణానికి రూ.313.15 కోట్లతో ఎల్ఓఏ జారీ అయింది. భూసేకరణ, కోర్టు వ్యవహారాలు పూర్తికావడంతో త్వరలోనే పనులు ప్రారంభంకానున్నాయి. మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.787 కోట్లు. ఓడరేవు – చిలకలూరిపేట – నకిరేకల్ కారిడార్ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలను కలిపే ఒక ముఖ్యమైన జాతీయ రహదారి ప్రాజెక్టు ఇది వాణిజ్య రవాణాకు, ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది.

వినుకొండ – గుంటూరు జాతీయ రహదారి…
వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కి.మీ. రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ రహదారుల విభాగం 3ఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ తర్వాత డీపీఆర్‌ పూర్తి కావడంతో రహదారి నిర్మించేందుకు హద్దులను గుర్తించి స్తంభాలు పాతాలని నిర్ణయించారు. వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.2360 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు పల్నాడు – గుంటూరు మధ్య రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.

CLICK HERE TO READ Cocoa City Relocation : కోకో సిటీకి తూర్పు సెగ Andhra Prabha Top Story

CLICK HERE TO READ MORE

Leave a Reply