రైతుల ఇబ్బందులను పట్టించుకోని ప్రభుత్వం

రైతుల ఇబ్బందులను పట్టించుకోని ప్రభుత్వం
-బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కడెం, ఆంధ్రప్రభ:
రాష్ట్రంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన “రైతు గోస – బీజేపీ భరోసా” కార్యక్రమంలో భాగంగా, నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పెద్దూర్ తండా గ్రామంలో గల కొనుగోలు కేంద్రాలను గురువారం పార్టీ నేతలు సందర్శించారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ముల్క కొమురయ్య, ఎమ్మెల్యేలు పైడి రాకేష్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బి. లక్ష్మీ నరసయ్య, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఆవేదన
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపునకు లారీలు సక్రమంగా రావడం లేదని, క్వింటాకు రూ. 60 చొప్పున అదనంగా చెల్లించాల్సి వస్తోందని రైతులు బీజేపీ నేతల దృష్టికి తెచ్చారు. రవాణా సదుపాయం లేక అకాల వర్షాలకు పంట ధాన్యం నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు
ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం 80 శాతం ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నా, వాస్తవానికి 40 శాతం కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. రవాణాకు తగినన్ని లారీలను సమకూర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్, మండల నాయకులు పి. శ్రీరామ్, రాపర్తి శ్రీనివాస్, జక్కుల సత్తన్న, అమరవేణి రవీందర్ గౌడ్, కళ్లెం రమణారెడ్డి, ధర్మపురి తిరుమలయ్య, గట్ల నల్లగొండ, ములికి కృష్ణ, సకినాల ప్రవీణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
