ఏలూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా..

ఏలూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా..
ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఏలూరులో వాడవాడలా ఘనంగా నిర్వహించారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ స్థాపనతో సమైక్య ఆంధ్రప్రదేశ్ దశా-దిశలను మార్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు.
4వ క్లస్టర్ పరిధిలోని అమీనా పేటలో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైబ్రిడ్ మహానాడు వేదికపై ఎన్టీఆర్ జయంతి వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యకర్తలు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తర్వాత కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎన్టీఆర్ సృష్టించిన చరిత్ర చిరస్మరణీయమన్నారు. అందుకే నేటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన హైబ్రిడ్ మహానాడు కార్యక్రమాన్ని వీక్షించి, పార్టీ ముఖ్యుల సందేశాలను ఆలకించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంప్ కార్యాలయం వద్ద గుండె సంబంధిత మెగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు పాల్గొన్నారు.
