Satellite Toll Collection | ఏఐ టెక్నాలజీతో ఆటోమేటిక్ టోల్ వసూళ్లు

Satellite Toll Collection | ఏఐ టెక్నాలజీతో ఆటోమేటిక్ టోల్ వసూళ్లు

Satellite Toll Collection | అమరావతి, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని ఈ ఏడాది డిసెంబర్ నుండి అమలు చేయాలని భావిస్తోంది. శాటిలైట్ ఆధారిత టోల్ కలెక్షన్ విధానం ద్వారా వాహనదారుల సమయంతో పాటు, పెట్రోల్ కూడా ఆదా అవుతుందని భావిస్తున్నారు. దీనివల్ల టోల్ గేట్ల దగ్గర వాహన రద్దీ కూడా తగ్గిపోతుంది.

ఫాస్టాగ్ విధానానికి భిన్నంగా, వాహనాలు ప్రయాణించిన దూరాన్ని మాత్రమే కచ్చితంగా కొలిచి ఆటోమెటిక్‌గా టోల్ ఛార్జీలను కట్ చేసే సరికొత్త టెక్నాలజీ అని అధికారులు చెబుతున్నారు. ఇక శాటిలైట్ టోల్ విధానం ఎలా పని చేస్తుందో కూడా అధికారులు వివరించారు. దీనివల్ల వాహనదారుడు నుంచి ప్రయాణించిన దూరానికే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఈ విధానం వల్ల కేంద్ర ప్రభుత్వానికి టోల్ ట్యాక్స్ ఆదాయం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

వాహనంలో అమర్చిన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ లేదా ఆన్-బోర్డ్ యూనిట్ ద్వారా వాహనం ఎక్కడ ప్రారంభమై, ఎక్కడ ముగిసిందో శాటిలైట్ ట్రాక్ చేస్తుంది. ప్రయాణించిన కిలోమీటర్ల మేర అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతాయి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగే అవసరం ఉండదు.

దీనివల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది. వాహనం గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నా, రహదారులపై ఉండే హై పెర్ఫార్మెన్స్ కెమెరాలు వాహనం నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి ఛార్జీలను వసూలు చేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సహాయంతో వాహనాలను గుర్తించి, నేరుగా బ్యాంక్ అకౌంట్ లేదా ఫాస్టాగ్ వాలెట్ నుండి నగదును కట్ చేస్తుంది. దీనివల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకునే సమస్య ఉండదు. ప్రయాణికులు వాస్తవంగా ఉపయోగించిన రోడ్డుకు మాత్రమే టోల్ చెల్లిస్తారు. దీని ద్వారా ఏటా సుమారు రూ.1,500 కోట్ల ఇంధనం ఆదా అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అమల్లోకి రావడానికి 2026 డిసెంబర్ నెల చివరి వరకు గడువుగా నిర్ణయించారు.

Leave a Reply