ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం : పెంటేల బాలాజీ

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం : పెంటేల బాలాజీ
-జనసేన పార్టీని టార్గెట్ చేస్తే సహించేది లేదని హెచ్చరిక
-పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ:
ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన పార్టీపై తరచూ విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ విమర్శించారు. మేధావిగా నాగేశ్వర్‌పై గౌరవం ఉన్నప్పటికీ, జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
గురువారం చిలకలూరిపేటలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన బాలాజీ, ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌లపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విశ్లేషణల పేరుతో తప్పుడు ఆరోపణలు
గత కొంతకాలంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణల పేరుతో జనసేన పార్టీపై విమర్శలు చేయడం అలవాటుగా మార్చుకున్నారని బాలాజీ ఆరోపించారు. ముఖ్యంగా జనసేననే లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం వెనుక వ్యక్తిగత అజెండా ఉందనే అనుమానం కలుగుతోందన్నారు.
పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి జగన్ అరెస్ట్ అంశంపై చర్చించారంటూ ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను పార్టీ మంత్రి, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటికే ఖండించారని గుర్తు చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా పార్టీపై, నాయకులపై ఆరోపణలు చేస్తే క్షేత్రస్థాయిలో పని చేస్తున్న లక్షలాది జనసైనికులు, వీర మహిళల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. రాజకీయ విశ్లేషణల పేరుతో వ్యక్తిగత అభిప్రాయాలను ప్రజలపై రుద్దడం తగదని వ్యాఖ్యానించారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ, గుర్తింపు కోసమో లేదా ఇతర లబ్ధుల కోసమో ఇలాంటి ఆరోపణలు చేస్తారని అనుకోలేదన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పకపోతే, జనసైనికుల నిరసనను ఎదుర్కోవాల్సి వస్తుందని పెంటేల బాలాజీ హెచ్చరించారు.
