జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో పీజీఆర్ఎస్
– ఎండ తీవ్రత దృష్ట్యా కలెక్టరేట్‌కు రావద్దని సూచన
– ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా వ్యాప్తంగా సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో ఆర్డీవో కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మండల కార్యాలయాల్లో తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర మండల అధికారులు, ఆర్డీవో కార్యాలయాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి, ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని ప్రజల వినతులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. మండల లేదా రెవెన్యూ డివిజన్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలకు సంబంధించి ప్రజలు తమ అర్జీలను ఆయా కార్యాలయాల్లోనే సమర్పించాలని సూచించారు.
అత్యవసరం అయితేనే..
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప అర్జీదారులు జిల్లా కలెక్టరేట్‌కు రావద్దని విజ్ఞప్తి చేశారు. మండల, డివిజన్ స్థాయిలో నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదుల స్థితిగతులను తెలుసుకోవాలంటే 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అలాగే Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని వివరించారు. కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడుతుందని, ఇందులో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.
పాత రసీదులు..
అర్జీదారులు తమ వివరాలతో పాటు సమస్యలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పులను తప్పనిసరిగా తీసుకురావాలని, సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్‌కు మెసేజ్ వస్తుందని, వాట్సాప్ ద్వారా నోటీసులు, ఎండార్స్మెంట్లు పంపిస్తున్నామని తెలిపారు. రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా సమాచారం అందిస్తామని, అర్జీ ఇచ్చేటప్పుడు సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు. పునరావృత అర్జీదారులు పాత రసీదులను తీసుకురావాలని, ప్రజలు ఈ పీజీఆర్‌ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
