No Clarity Trump : ఇరాన్ ఊసే లేదు…

చైనా నుంచి బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
తైవాన్ సంగతి తర్వాతే
చైనాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక ప్రకటనే లేదు

ఆంధ్రప్రభ వెబ్ (అంతర్జాతీయం) : పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చలు అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారికంగా ప్రకటన చేస్తారని ప్రపంచ దేశాలు ఎదురు చూశాయి. ప్రధానంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ప్రపంచంలో అనేక దేశాలు ఆయిల్ సంక్షోభం ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో చైనా, అమెరికా అధ్యక్షుల మధ్య జరిగే చర్చలతో యుద్ధం ఆగుతుందని అందరూ భావించారు. కానీ పశ్చిమాసియా ఉద్రికత్తలు, తైవాన్ గురించి ఆ ఇద్దరు అధ్యక్షులు ఏమి మాట్లాడుకున్నారో కూడా అధికారికంగా వెల్లడి కాలేదు.

No Clarity Trump : చైనా నుంచి బయలుదేరిన ట్రంప్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో రెండు రోజుల చర్చల అనంతరం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రప్ చైనా నుంచి బయలుదేరారు. ఈ చర్చలలో ఇరుపక్షాలు ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సంబంధంగా వారు అంగీకరించిన దానిని స్థిరీకరించడంలో సాధించిన పురోగతిని ప్రశంసించుకున్నారు. అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలను జరిగాయని, చాలా రకాల సమస్యలు పరిష్కరించబడ్డాయని ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ, ఆయన బీజింగ్ నుండి బయలుదేరే ముందు ఎటువంటి ప్రధాన ఒప్పందాలు గానీ, పురోగతులు గానీ ప్రకటించలేదు.
No Clarity Trump : తైవాన్‌పై స్పష్టత రాలేదు..

తైవాన్‌పై చైనా వాదనలను సరిగ్గా నిర్వహించకపోతే ఘర్షణలు, సంఘర్షణలకు దారితీయవచ్చని షీ మొదటి రోజే ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ వివాదాస్పద ద్వీపం చర్చలపై బీజింగ్ దృష్టిలో కేంద్రంగా ఉంది. సమావేశానంతరం అలస్కాకు వెళ్లే మార్గంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఆ ప్రజాస్వామ్య ద్వీపానికి ఆయుధాల విక్రయంతో ముందుకు వెళ్లాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తైవాన్‌కు ప్రతిపాదించిన 14 బిలియన్ డాలర్ల ఆయుధ ప్యాకేజీ ముందుకు సాగుతుందా? లేదా? అనే దానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. రాబోయే కొద్ది కాలంలోనే ఒక నిర్ణయం తీసుకుంటాను అని అలస్కాకు వెళ్లే మార్గంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో ట్రంప్ అన్నారు. తుది నిర్ణయం తీసుకునే ముందు తాను తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టెతో మాట్లాడవలసి ఉంటుందని చెప్పారు.

హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం గురించి…
ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేయడంలో చైనా కీలకపాత్ర వహిస్తుందన్న ప్రచారం ప్రపంచ దేశాల్లో ఉన్నాయి. పాకిస్తాన్ జోక్యం జరిగిన చర్చలు విఫలం కావడంతో పాకిస్తాన్ సూచన మేరకు చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉందని అందరూ భావించారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటిస్తున్నారని ప్రచారం కూడా జోరుగా సాగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం గురించి షీతో చర్చించారని, అయితే నెలల తరబడి సాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేయమని ట్రంప్ షీని అడగలేదని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. అంటే దీనిబట్టి ఈ యుద్ధంపై ఇరు దేశాలు చర్చలు జరిపలేదని స్పష్టమవుతుంది. ఇంతకీ ఎందు దీనిపై ఆ రెండు దేశాలు చర్చించలేదో వెల్లడికాలేదు.
వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత రాలేదు…

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవడానికి చైనాలో పర్యటన ముగిసింది. దాదాపు దశాబ్ద కాలంలో ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటన మే 13వ తేదీ నుంచి 15 వరకు కొనసాగింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలు కీలక దశలో ఉన్న తరుణంలో ఈ పర్యటన జరిగింది. ఎన్విడియాకు చెందిన జెన్సెన్ హ్వాంగ్, యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల తరఫున ఎలాన్ మస్క్, బ్లాక్‌రాక్ నుంచి ల్యారీ ఫింక్ కూడా ట్రంప్‌తో వెళ్లారు. అమెరికా–చైనాల మధ్య సున్నితమైన వాణిజ్య ఒప్పందానికి కూడా ఈ సమావేశం కీలకమైంది. గతేడాది ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా, చైనాల మధ్య టారిఫ్ యుద్ధానికి దారితీసింది. ఆ సమయంలో ఇరు దేశాలు ఒకదానిపై ఒకటి 100 శాతానికి పైగా సుంకాలను విధించుకున్నాయి. గత అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో ట్రంప్, షీ జిన్‌పింగ్‌ల సమావేశం తర్వాత టారిఫ్‌లపై తాత్కాలిక విరామం ప్రకటించారు. కానీ ఇరు దేశాల నుంచి హెచ్చరికలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన ఈ పర్యటన ఎంతవరకు ఫలించిందో వేచి చూడాలి.
ALSO READ : Us China Talks : అమెరికా..చైనా కీలక భేటీ Andhra Ptabha Top Story
