పూడికతీతతో పునర్జన్మ పొందిన నొస్సం పెద్ద చెరువు…

పూడికతీతతో పునర్జన్మ పొందిన నొస్సం పెద్ద చెరువు…

జలదార – జలహారతి”తో రైతుల్లో కొత్త ఆశలు..
ఉపాధి హామీ పనులతో చెరువు లోతు పెంపు..
600 ఎకరాల సాగుకు నీటి భరోసా..
చెరువు మట్టితో సారవంతమవుతున్న రైతు పొలాలు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జలదార – జలహారతి”తో నొస్సం పెద్ద చెరువు లో గ్రామస్తుల ఐక్యమత్యంతో ఉపాధి హామీ పథకం అమలుతో రైతు భవిష్యత్తుకు కొత్త వెలుగు వెలుగు రావటం విశేషం.నంద్యాల జిల్లా సంజామల మండలంలోని నొస్సం గ్రామానికి ఆనుకొని ఉన్న పెద్ద చెరువు ఇప్పుడు గ్రామ ప్రజల ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది. ఒకప్పుడు పూడికతో నిండిపోయి తన అసలు సామర్థ్యాన్ని కోల్పోయిన ఈ చెరువు, ఇప్పుడు జలదార – జలహారతి కార్యక్రమంతో కొత్త జీవం పొందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పూడికతీత పనులు గ్రామ రైతాంగంలో కొత్త ఆశలు నింపుతున్నాయని గ్రామస్తులు పేర్కొనటం విశేషం.

గ్రామంలో ఒక్కటే చెరువు…

గ్రామంలో ఉన్న పెద్ద చెరువు సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద చెరువుకు చుట్టుపక్కల నాలుగు వేల ఎకరాల కొండ ప్రాంతం నుంచి వర్షపు నీరు చేరుతుంది. ప్రతి వర్షాకాలంలో కొండల నుంచి ఉరకలెత్తే నీరు ఈ చెరువులోకి చేరి నిండుగా నీరు నిల్వ ఉండేదన్నారు.చెరువుకు ఉన్న రెండు తూముల కింద దాదాపు 500 ఎకరాల సాగుభూమి కి నీరు అందుతుంది. ఈ భూముల్లో ప్రధానంగా వరి పంట సాగు చేస్తుంటారు. అయితే సంవత్సరాలుగా పేరుకుపోయిన పూడిక కారణంగా చెరువు లోతు తగ్గిపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ రావడం రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతులకు అవసరమైనంత కాలం సాగునీరు అందక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యను గుర్తించిన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దృష్టికి తీసుకెళ్లారు.జలదార – జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువు పూడికతీత పనులను ప్రాధాన్యంగా చేపట్టలని అధికారులకు ఆదేశించారు.ఈ పనుల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో  రూ.9.51 లక్షలు వెచ్చించి పనులను వేగవంతంగా అమలు చేస్తున్నారు. ఉపాధి హామీ శ్రామికులు, రైతులు, క్షేత్ర సహాయకులు, సాంకేతిక సహాయకులు సమన్వయంతో పనిచేస్తూ చెరువుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. పూడికతీత పనుల వల్ల చెరువు లోతు గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ఏడాది వర్షాకాలంలో మరింత ఎక్కువ నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 500 ఎకరాలకు పరిమితమైన సాగు విస్తీర్ణం, ఇకపై 600 ఎకరాల వరకు పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో నుంచి తీస్తున్న సారవంతమైన మట్టిని రైతులు తమ సొంత ఖర్చులతో పొలాలకు తరలించుకుంటున్నారు. ఈ మట్టితో పొలాల్లో ఉన్న గుంతలను పూడ్చడం, తెగిపోయిన గట్లను బలపరచడం, భూమి సారాన్ని పెంచడం జరుగుతోంది. దీంతో భూముల ఉత్పాదకత పెరిగి మంచి దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు.
…ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి  మాట్లాడుతూ, చెరువులు గ్రామీణ వ్యవసాయానికి జీవనాడి వంటివి. పూడికతీత పనులు కేవలం నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడమే కాదు, రైతుల ఆదాయాన్ని పెంచే శాశ్వత పరిష్కారంగా నిలుస్తాయి. ‘జలదార – జలహారతి’ కార్యక్రమం ద్వారా ప్రతి నీటి వనరును పునరుద్ధరించి గ్రామాలను సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
అంతేకాకుండా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ శ్రామికులకు ఉపాధి లభిస్తుండగా, రైతులకు సాగునీటి భరోసా కలుగుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. నొస్సం పెద్ద చెరువు పూడికతీత పనులు ఇప్పుడు ఒక సాధారణ అభివృద్ధి కార్యక్రమంగా కాకుండా… నీటిని నిల్వ చేస్తేనే గ్రామ భవిష్యత్తు నిలుస్తుందన్నారు.
ఈ సంఘటన మరికొన్ని గ్రామాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రైతులు పేర్కొనటం విశేషం.

Leave a Reply