జర్నలిస్టుల హౌస్ సైట్లకు న్యాయం చేయాలి..

జర్నలిస్టుల హౌస్ సైట్లకు న్యాయం చేయాలి..
మంత్రి టీజీ భరత్‌ను కలిసిన మహేష్, సాయికుమార్ నాయుడు, హరినాథ్ రెడ్డి*
హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వినతి
జర్నలిస్టుల సంఘం తరఫున మహేష్ బృందం పోరాటం
KUDA ఆమోదించిన లేఅవుట్‌కు మౌలిక వసతులు కల్పించండి
కలెక్టర్ సిరి, జేసీ నూర్ కమల్‌కు సంఘం విజ్ఞప్తి
19 నెలల విచారణ తర్వాత ఆమోదం
ఇప్పటికైనా న్యాయం చేయాలని మహేష్ వినతి
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా జర్నలిస్టుల పరస్పర సహకార గృహ నిర్మాణ సహకార సంఘానికి చెందిన హౌస్ సైట్ల రద్దు ఉత్తర్వులను ఉపసంహరించుకోవడంతో పాటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని సంఘం నాయకులు రాష్ట్ర పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌ను కోరారు. ఈ మేరకు సంఘం ప్రతినిధులు సమగ్ర వినతిపత్రాన్ని మంత్రికి సమర్పించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కె. మహేష్, జాయింట్ సెక్రటరీ ఎం. సాయికుమార్ నాయుడు, హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు మంత్రి టీజీ భరత్‌తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూర్ కమల్‌ను కలిసి సమస్యను పూర్తిస్థాయిలో వివరించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, KUDA ఆమోదాలు, రెగ్యులరైజేషన్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలను కూడా వారికి అందజేశారు.
15.44 ఎకరాల భూమి విక్రయం…
2009లో ప్రభుత్వం కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడు గ్రామ పరిధిలోని సర్వే నెం.478లో 15.44 ఎకరాల భూమిని కర్నూలు జిల్లా జర్నలిస్టుల పరస్పర సహకార గృహ నిర్మాణ సహకార సంఘానికి విక్రయించిన విషయాన్ని సంఘం నాయకులు గుర్తు చేశారు. ఈ భూమిని జర్నలిస్టుల గృహ నిర్మాణ అవసరాల కోసం ప్రభుత్వం చట్టబద్ధంగా కేటాయించిందని పేర్కొన్నారు. అయితే అనంతరం అప్పటి జిల్లా కలెక్టర్ RCE1/1091/2022, తేదీ 18-08-2022 ప్రకారం గృహ స్థలాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో జర్నలిస్టులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు.
హైకోర్టులో పోరాటం..
ఈ రద్దు ఉత్తర్వులను సవాలు చేస్తూ జర్నలిస్టులు WP నెం.29260/2022 మరియు WP నెం.30302/2022 కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసినట్లు వివరించారు. మొదటి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు 13-09-2022న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి కలెక్టర్ ఉత్తర్వులను నిలిపివేసిందని తెలిపారు. అదే విధంగా రెండో పిటిషన్‌లో కూడా 26-09-2022న సమాన ఉత్తర్వులు వెలువడ్డాయని పేర్కొన్నారు. ఇది జర్నలిస్టుల సంఘం వాదనలకు న్యాయపరమైన బలం చేకూర్చిందని సంఘం నాయకులు వివరించారు.
KUDA ఆమోదంతో బలమైన ఆధారాలు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్ నెం.10, మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ (ఎం), తేదీ 08-01-2020 ద్వారా అనధికార లేఅవుట్లలోని వ్యక్తిగత ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందని తెలిపారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని సంఘానికి చెందిన ఏడుగురు జర్నలిస్టులు 2020 డిసెంబర్‌లో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA) వద్ద దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం KUDA 2022 సెప్టెంబర్ 22న ఏడుగురు జర్నలిస్టుల వ్యక్తిగత ప్లాట్లను క్రమబద్ధీకరించిందని తెలిపారు. దీర్ఘకాలంగా 19 నెలలపాటు విచారణ జరిపిన తర్వాత మొత్తం లేఅవుట్‌కు IPLP 2020/DTCP-KUDA/DINN/000085 నంబరుతో ఆమోదం లభించడం తమ వాదనలకు మరింత బలం చేకూర్చిందన్నారు.
మౌలిక వసతుల కల్పనపై విజ్ఞప్తి..
హైకోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్న నేపథ్యంలో జర్నలిస్టుల కాలనీలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సరఫరా వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించాలని సంఘం నాయకులు కోరారు. అలాగే ఈ భూమికి సంబంధించిన రికార్డులను రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖల్లో అధికారికంగా “జర్నలిస్టుల హౌస్ సైట్లు”గా నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాయకుల పాత్రపై ప్రశంసలు..
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ప్రధాన కార్యదర్శి ఎస్.కె. మహేష్ నిరంతరం కృషి చేస్తున్నారని సంఘ సభ్యులు పేర్కొన్నారు. జాయింట్ సెక్రటరీ ఎం. సాయికుమార్ నాయుడు, హరినాథ్ రెడ్డి సమస్య పరిష్కారానికి అధికారులను కలిసి చట్టపరమైన అంశాలను వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. సమస్యను సానుకూలంగా పరిశీలించి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి టీజీ భరత్ హామీ ఇచ్చినట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
